ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాంక్రీట్‌ వేయని ‘రాక్రీట్‌’.. జాప్యంపై ప్రశ్నించలేని స్థితిలో అధికారులు

ROCKREET : మన ప్రభుత్వం కడుతోంది కాలనీలు కాదు..ఊళ్లు.! పేదలకు ఇళ్ల నిర్మాణ ప్రారంభోత్సవంలో జగన్‌ కొట్టిన డైలాగ్‌ ఇది. కానీ ఇప్పుడు అక్కడ ఊళ్లు కాదు కదా.. ఇళ్ల పునాదులకే దిక్కు లేదు. ఆర్భాటంగా మొదలైన నిర్మాణాలు అతీగతీలేక వెక్కిరిస్తున్నాయి. ఆప్షన్‌-3 కింద.. 63 వేల ఇళ్ల నిర్మాణ కాంట్రాక్ట్‌ దక్కించుకున్న 'రాక్రీట్‌' అనే సంస్థ.. కనీసం కాంక్రీట్‌ కూడా వేయలేదు. రాక్రీట్‌ సంస్థకు అడ్డదిడ్డంగా పనులు, అయాచిత మేళ్లు చేకూర్చడంలో.. ఉత్సాహం చూపిన ప్రభుత్వం.. ఇళ్ల నిర్మాణంలో జాప్యంపై మాత్రం కిమ్మనడం లేదు.

ROCKREET
ROCKREET

By

Published : Nov 9, 2022, 4:00 PM IST

కాంక్రీట్‌ వేయని ‘రాక్రీట్‌’.. జాప్యంపై ప్రశ్నించలేని స్థితిలో అధికారులు

ROCKREET:సీఎం ఇలాకా పులివెందులలోని జగనన్న కాలనీలో ఇళ్లు లేవు కదా.. అంటారా? కడితే ఉండేవి. 10 నెలల క్రితం ఇక్కడ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కానీ ఇళ్లు పునాదులు దాటి పైకి వెళ్లలేదు. ఇక్కడ 7వేలకుపైగా ఇళ్లు కట్టాల్సి ఉండగా.. నాలుగున్నర వేల ఇళ్లకు మాత్రమే పునాదులు పడ్డాయి. మిగతా వాటికి అతీగతీ లేదు. ఇక్కడ ఇళ్లు నిర్మించాల్సిన బాధ్యత రాక్రీట్‌ సంస్థది.

గుంటూరు జిల్లా పేరేచెర్లలోని జగనన్న కాలనీలో.. 18 వేల ప్లాట్లు వేసి.. 16 వేల మందికి ఇళ్లపట్టాలిచ్చారు. మొదటి విడతగా సుమారు 10 వేల గృహాలు మంజూరు చేశారు. ఇక్కడా శంకుస్థాపన చేసి రెండేళ్లు కావస్తున్నా.. గృహాలు పునాదులు దాటలేదు. ఇళ్లు కట్టేందుకు ప్రభుత్వమే కుప్పలు తెప్పలుగా ఇసుక డంప్‌ చేసి పెట్టింది. ఇనుమూ అదేస్థాయిలో.. నిల్వచేసింది. ఇనుము తుప్పుపడుతోంది. ఇసుక మట్టిలో కలిసిపోతోంది. కానీ ఇళ్ల నిర్మాణం మాత్రం జరగలేదు. ఇక్కడ నిర్మించాల్సింది కూడా రాక్రీట్‌ సంస్థే. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే... గుత్తేదారు సంస్థ కట్టకపోవడంతో లబ్దిదారులే 50 వరకూ ఇళ్లు కట్టుకున్నారు.

విజయనగరం మండలంలోని గుంకలాం జగనన్నకాలనీ.. రాష్ట్రంలోనే.. రెండో అతిపెద్ద లేఅవుట్‌. సమీపంలో ఉండే కొండకరకాంలోని లేఅవుట్‌కూడా కలిపి.. మొత్తం 12 వేల 963 గృహాలను ప్రభుత్వం ఇక్కడ మంజూరు చేసింది. కానీ 1500 ఇళ్ల పనులే ప్రారంభమైనట్లు అధికారులు చెబుతున్నారు. దీనికి బాధ్యతా రాక్రీట్‌ సంస్థే.

విజయవాడలోని నున్న లేఅవుట్‌ విషయానికొస్తే.. ఇక్కడ 2,300 గృహాలు నిర్మించాలి. మూడు రోజుల కిందటే ఇక్కడ పనులు చేపట్టారు. దీనికి బాధ్యతా... అదే రాక్రీట్‌ సంస్థ।. విజయనగరం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, పులివెందులలో రాక్రీట్‌ సంస్థకు పెద్ద లేఅవుట్లే కేటాయించారు. కొన్ని ప్రాంతాల్లో దాదాపు రెండేళ్లు కావస్తున్నా.. ఇంకా అనేక ఇళ్లు పునాది దశ దాటలేదు. కొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తున్నారు.

కుమారుడు, బంధువు, అనుచరులే డైరెక్టర్లు.. రాక్రీట్‌.. రాక్రీట్‌... రాక్రీట్‌.. అసలు ఎవరిదీ రాక్రీట్‌ సంస్థ. ప్రభుత్వం ఎందుకు.. ఆ సంస్థను పరుగులు పెట్టించలేకపోతోంది. పనులు చేయించుకోలేకపోతోంది..? అంటే ఇక్కడ లెక్కలేనన్ని లొసుగులున్నాయి. రాప్తాడు వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి బంధుగణానిదే.. రాక్రీట్‌ సంస్థ.. తోపుదుర్తి సాయిసిద్ధార్థరెడ్డి, తోపుదుర్తి అమర్నాథ్‌రెడ్డి సహా మరో ముగ్గురు.. దీనికి డైరెక్టర్లు. సాయిసిద్ధార్థరెడ్డి.. తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి కుమారుడు కాగా,.. అమర్నాథ్‌రెడ్డి ఆయన సమీప బంధువు. మిగతా ముగ్గురూ ప్రకాశ్‌రెడ్డి ప్రధాన అనుచరులే.

పేరుకే భాగస్వామి కాదు.. కానీ పెత్తనమంతా ఆయనదే: ఇక్కడ పేరుకు.. ప్రకాశ్‌రెడ్డి నేరుగా భాగస్వామి కాదన్నమాటేగానీ పెత్తనమంతా ఆయనదే. ఇళ్ల నిర్మాణాలపై.. జిల్లాల్లో నిర్వహించే సమీక్షల్లో ప్రకాశ్‌రెడ్డే పాల్గొంటారు. గత నెలలో గుంటూరు కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షకూ ఇతర గుత్తేదారులతోపాటు ఆయనే హాజరయ్యారు. అర్థమైంది కదా.. ఇక్కడ గుత్తేదారు ఆయనే.. రాక్రీట్‌ సంస్థా ఆయనదే. ఇక వాళ్లు వేసిందే కాంక్రీట్‌. కట్టిందే పునాది.. ఇల్లు ఎప్పటికి కడతారు..? ఇంకెన్నాళ్లు కడతారు అని అడిగేందుకు ఏ అధికారైనా సాహసించగలరా? నిజానికి వంద కోట్ల విలువైన పనులకు జ్యుడిషియల్‌ ప్రివ్యూ కమిటీ ఆమోదం తీసుకున్నాకే... గుత్తేదారుల్ని ఖరారు చేయాలని ప్రభుత్వమే స్పష్టం చేసింది. కానీ.. రాక్రీట్‌ సంస్థకు ఇళ్ల నిర్మాణాన్ని కట్టబెట్టడంలో ఆ నిబంధన ఎందుకు పాటించలేదో.. అధికారులు బయటకు చెప్పలేని పరిస్థితి.

టెండర్​ విధానం పాటించకుండా నేరుగా అప్పగింత: ఆప్షన్‌-3 కింద ఇప్పటి వరకూ అత్యధికంగా.. రాక్రీట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ అండ్‌ లాజిస్టిక్‌ ప్రైవేటు లిమిటెడ్‌కే రాష్ట్ర ప్రభుత్వం 63 వేల ఇళ్ల నిర్మాణాన్ని.. అప్పనంగా అప్పగిచింది. కాంట్రాక్ట్‌ విలువ.. దాదాపు 1100 కోట్లరూపాయలు. ఈ పనుల అప్పగింతలో టెండర్‌ విధానం పాటించలేదు. ప్రభుత్వం.. నేరుగా కట్టబెట్టింది. పైగా... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక్కో ఇంటి నిర్మాణానికి ఇచ్చే లక్షా 80వేల రూపాయలతోపాటు.. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు పావలా వడ్డీ కింద ఇచ్చే 35 వేల రుణాన్నీ కొన్నిచోట్ల గుత్తేదారు సంస్థే తీసుకుంటోంది.

రాక్రీట్​ సంస్థపై నోరు మెదపలేకపోతున్న అధికారులు : ప్రభుత్వం ఇచ్చే నిర్మాణ వ్యయం నేరుగా గుత్తేదారు సంస్థకు ఇచ్చేందుకు నిబంధనలు అంగీకరించవు. దీంతో లబ్ధిదారుల ఖాతాల్లో వేసే బిల్లుల మొత్తాన్ని.. గుత్తేదారు సంస్థలకు ఇచ్చేలా అంగీకార పత్రాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో వేసిన మొత్తాన్ని గుత్తేదారు సంస్థ ఖాతాల్లోకి మళ్లించే విధంగా ఓ ప్రైవేటు బ్యాంకుతోనూ ఒప్పందం చేసుకున్నారు. ఇళ్ల నిర్మాణానికిగానూ ఈ ఏడాది ఆగస్టు నాటికి 256 కోట్ల విలువైన ఇనుము, సిమెంటును ప్రభుత్వం సదరు సంస్థకు సరఫరా చేసింది. ఇళ్ల నిర్మాణం చేపట్టకపోతే పట్టాలు రద్దు చేస్తాం అంటూ లబ్దిదారులను.. బెదిరిస్తున్న అధికారులు.. ఇళ్లు కట్టని రాక్రీట్‌ సంస్థపై నోరు తెరవలేకపోతున్నారు.


ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details