Chandrababu Naidu: అల్లా కన్నెర్ర చేస్తే ముస్లిం మైనార్టీల ఆస్తులు, వక్ఫ్ బోర్డు భూములు కబ్జా చేసేవారు మసైపోతారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర కమిటీతో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ సభ్యులు భారీగా పాల్గొన్నారు.
రాష్ట్రంలో మార్పు మొదలైందనీ.., ఆ మార్పు మొదట ముస్లిం మైనార్టీల్లో స్పష్టంగా కనిపిస్తోందని చంద్రబాబు అన్నారు. ఇది పెను తుపాన్‌గా మారి.. వైకాపా కొట్టుకుపోతుందని ధ్వజమెత్తారు. ముస్లిం మైనార్టీలకు ఏం చేశాడో చెప్పుకునే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. వక్ఫ్ బోర్డు భూములు ఆక్రమించే కబ్జాదారులు చెలరేగిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత అల్లుళ్లకు రాసిచ్చినట్లు వైకాపా నేతలకు వక్ఫ్ బోర్డు భూములు రాసిస్తున్నారని ఆరోపించారు. రేపు ముస్లిం మైనార్టీల ఆస్తులు దోచుకునేందుకూ వెనకాడరని ధ్వజమెత్తారు.