Graduate MLC Elections TDP Candidate Arrest : పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థి రామగోపాల్ రెడ్డి అరెస్టులపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పందించారు. టీడీపీ అభ్యర్థి గెలిచాడని ముఖ్యమంత్రి అక్కసుతో అక్రమ చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. ఎన్నికల ఫలితాలు వచ్చి విజయాన్ని అధికారికంగా ప్రకటించిన తర్వాత.. 12 గంటలు గడిచిన డిక్లరేషన్ ఇవ్వకుండా అధికారులు ఉండిపోయారని మండిపడ్డారు. ఎవరి ఒత్తిడి వల్ల అధికారులు చేశారో చెప్పాలని టీడీపీ నేతలు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తున్నారని నేతలు దుయ్యబట్టారు.
చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు : పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ తెలుగుదేశం అభ్యర్థి రామగోపాల్ రెడ్డి అక్రమ అరెస్టుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఘాటుగా స్పందించారు. పులివెందుల టీడీపీ నేత రామగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచాడని.. అక్కసుతో అర్థరాత్రి అరెస్టు చేయించిన జగన్ రెడ్డిది ఏం బతుకు అని విమర్శించారు. ఇంతకంటే ముఖ్యమంత్రి ఇంకేం భ్రష్టు పట్టిపోవాల్సింది ఉందని ప్రశ్నించారు. ప్రజా తీర్పును గౌరవించి క్షమాపణ కోరాలి అని డిమాండ్ చేశారు. ఎన్నికలలో పోటీ చేసిన గెలుపొందిన అభ్యర్థికి డిక్లరేషన్ ఇవ్వకుండా.. ఒత్తిడి చేసి అడ్డుపడతావా అని సీఎం జగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.