Condolence to Taraka Ratna : జనవరి 27వ తేదీన అస్వస్థతుకు గురై.. 23 రోజులపాటు బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తారకరత్న కన్నుమూశారు. హైదరాబాద్లోని తారకరత్న స్వగృహానికి పలువురు తరలివచ్చి.. పార్దివదేహానికి నివాళులు అర్పించారు. బెంగుళూరు నుంచి స్వగృహానికి చేరుకున్న తారకరత్న పార్దివదేహాన్ని.. వివిద రంగాలకు చెందిన ప్రముఖులు సందర్శించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నివాళులు అర్పించారు. నారా లోకేశ్, నారా బ్రాహ్మణి తారకరత్న మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, నటుడు అజయ్ నివాళులు అర్పించారు.
గవర్నర్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్: తారకరత్న మృతిపట్ల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తారకరత్న కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
చంద్రబాబు నివాళులు : తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆయన సతీమణితో కలిసి తారకరత్నకు నివాళులు అర్పించారు. హైదరాబాద్కు చేరుకున్న చంద్రబాబు దంపతులు తారకరత్నకు నివాళులు అర్పించి సంతాపం వ్యక్తం చేశారు. తారకరత్న మృతి దురదృష్టకరమని చంద్రబాబు అన్నారు. తారకరత్న కొలుకుని మళ్లీ తిరిగి వస్తాడని ఆశించామని పేర్కొన్నారు. 23 రోజులు మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచారని.. చిన్న వయస్సులో తారకరత్న ప్రాణాలు కోల్పోవటం బాధగా ఉందన్నారు. సినీ రంగంలో మంచి భవిష్యత్ ఉన్న వ్యక్తి అని తెలిపారు. ఎప్పుడూ సమాజానికి ఏదో సేవ చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తి తారకరత్న అని బాబు చెప్పారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన ఉందనే అభిలాషను తారకరత్న చెప్పారని వెల్లడించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్న అని చంద్రబాబు అన్నారు.
"మంచి భవిష్యత్ ఉన్న వ్యక్తి. సినిమా రంగంలో ఒకే రోజు తొమ్మిది సినిమాలు ప్రారంభించారు. చిన్న వయస్సులోనే 23 సినిమాలలో నటించారు. ఆయనకు నంది అవార్డు కూడా వచ్చింది. ఎప్పుడు సమాజానికి ఎదో చేయాలనుకునే వ్యక్తి. రాజకీయాలలోకి వస్తానని నాతో అన్నారు. కానీ, ఇప్పుడు ఇలా జరగటం చాలా బాధాకరం." -చంద్రబాబు, టీడీపీ అధినేత
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంతాపం :తారకరత్న మృతిపట్ల వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నివాళులు అర్పించారు. హైదరాబాద్లోని మోకిలలో ఉంచిన తారకరత్న బౌతికకాయన్ని ఆయన సందర్సించి సంతాపం వ్యక్తం చేశారు. బెంగూళూరులో తారకరత్న చికిత్స తీసుకుంటున్న సమయంలో కూడా విజయసాయి రెడ్డి.. బెంగూళూరు వెళ్లి తారకరత్న కుటుంబ సభ్యులను పరామర్శించారు.
జూ. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ల నివాళులు :తారకరత్న మరణ వార్త నందమూరి కుటుంబాన్ని కలచి వేసింది. తిరిగి వస్తాడని ఆశించిన నందమూరి కుటుంబ సభ్యులకు తారకరత్న బాధనే మిగిల్చారు. బెంగుళూరు నుంచి హైదరాబాద్కు చేరుకున్న తారకరత్న పార్థివదేహన్ని జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, నటుడు అజయ్ సందర్శించారు. అనంతరం తారకరత్నకు నివాళులు అర్పించారు.