Ys Vivekananda Reddy Murder Case : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని సీబీఐ అధికారులు నాలుగున్నర గంటలపాటు విచారించారు. దిల్లీ నుంచి వచ్చిన ఎస్పీ రాంసింగ్ నేతృత్వంలోని దర్యాప్తు బృందం హైదరాబాద్ కోఠి కేంద్రీయ సదన్‌లోని సీబీఐ కార్యాలయంలో ప్రశ్నించింది. అవినాష్‌రెడ్డిని విచారించడానికి ముందు వివేకా హత్య జరిగిన సమయంలో దర్యాప్తు చేసిన కడప పోలీసులనూ సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఈ కేసులో ఇప్పటిదాకా నమోదు చేసిన వాంగ్మూల ఆధారంగా అవినాష్‌రెడ్డికి అధికారులు ప్రశ్నలు సంధించారు.
2019 మార్చిలో వివేకా హత్య జరగ్గా.. తొలుత గుండెపోటు వల్లే చనిపోయారంటూ ప్రచారం చేశారు. కేసు దర్యాప్తు క్రమంలో ఇప్పటివరకూ సేకరించిన సాక్ష్యాధారాలను ముందుంచి అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించినట్లు సమాచారం. ఎంపీ కాల్ డేటా వివరాలనూ ముందుంచి ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. వివేకా హత్య వెనుక కోట్లలో లావాదేవీలు జరిగాయనే ఆరోపణలపైనా దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. విచారణ అనంతరం అవినాష్ రెడ్డికి మళ్లీ పిలిస్తే రావాలని సీబీఐ సూచించగా.. పూర్తిగా సహకరిస్తానని అవినాష్‌రెడ్డి తెలిపారు.