బీజేపీ నాయకుల 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు..కొన్ని విషయాలపై స్పష్టం BJP Leaders Comments: భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. చైనాలో జనాభా మనకన్నా ఎక్కువ ఉండొచ్చని, కానీ అక్కడ ప్రజాస్వామ్యం లేదని ఆయన అన్నారు. భారతదేశంలోనే ప్రజాస్వామ్య వ్యవస్థలు ఉన్నాయని తెలిపారు. బ్రిటీష్‌లో ఇంకా రాజరిక పాలన నడుస్తుందని, భారతదేశంలో రాష్ట్రపతి వ్యవస్థ ఉందని ప్రజలే ఎన్నుకుంటారన్నారు. మనకున్న రాజ్యాంగ వ్యవస్థ చాలా గొప్పదని పేర్కొన్నారు. ఛాయ్ అమ్మే వారి కొడుకుని భారత ప్రధానిని చేసింది రాజ్యాంగమేనని, ఒక అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేసిందన్నారు.
భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో ప్రధాని ముందుకెళుతున్నారని తెలిపారు. రాజ్యాంగం ఒక బాధ్యతగా ప్రధాని నరేంద్ర మోదీ పాటిస్తున్నారని తెలిపారు. మన రాజ్యాంగం ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేసే అవకాశం దక్కిందన్నారు. మన రాజ్యాంగం వల్లే ప్రపంచంలో భారతదేశం ప్రత్యేకంగా నిలిచిందన్నారు. జీ 20 దేశాలకు ప్రాతినిధ్యం వహించే స్థాయికి భారత్ వెళ్లిందని, భారత్‌ని కాదనే పరిస్థితి ప్రపంచ దేశాల్లో లేదని అన్నారు. భారత్‌ను ఆ దిశగా తీసుకుని వెళ్లినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మనమంతా కృతజ్ఞతులమని సోము వీర్రాజు తెలిపారు.
పార్టీ మారటం లేదు: గుంటూరు జిల్లా భాజపా కార్యాలయంలో 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురష్కరించుకుని ఆ పార్టీ సీనియర్ నేత కన్నా లక్ష్మీ నారాయణ జాతీయ పతాకాన్నిఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగమే లేకపోతే ప్రధానిగా ఉండేవాడినే కాదని గతంలో మోదీ అన్న మాటలను ఆయన గుర్తు చేసుకున్నారు. పార్టీ మారుతున్నట్లు తనపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని వివరణ ఇచ్చారు.
జనసేనతో బీజేపీ పొత్తు: ప్రజల గొంతును నొక్కే విదంగా జీఓ ఒకటిని ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా అనంతపురంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పక్క దేశంపై ఉక్కుపాదం మోపుతూ.. అనేక సవాళ్లను అధిగమించి భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద శక్తిగా బీజేపీ ఎదిగిందన్నారు. ఏపీలో ఎమర్జెన్సీని తలపించే జీఓ ఉందని నిప్పులు జరిగారు. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లుగా ఉన్న భారతదేశంలో జీవో నెంబర్ ఒకటితో ఏపీలో ఆంక్షలు పెట్టడం దారుణమన్నారు. అధికార పార్టీ నాయకులు ఈ ఆంక్షలు పాటిస్తున్నారా అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందన్నారు. జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుందని సత్య కుమార్ స్పష్టం చేశారు. ప్రాంతీయ పార్టీల పాలనతోనే ఆంధ్రప్రదేశ్‌లో పాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు.
ఇవీ చదవండి