APSRTC Buses Divert to CM Meetings: సీఎం జగన్ ఎక్కడ పర్యటించినా ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. సీఎం సభకు జనసమీకరణ చేయటానికి ఆర్టీసీ బస్సులను ఉపయోగిస్తుండడంతో ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన సీఎం జగన్ సభ వద్ద చుట్టుపక్కల జిల్లాల్లో ప్రజలకు రవాణా సేవలందించే వందలాది బస్సులన్నీ బారులు తీరాయి. రాజధాని ప్రాంతం విజయవాడలో వందలాది బస్సు సర్వీసుల రద్దుతో ప్రజలు అష్టకష్టాలు పడ్డారు.
విజయవాడలో 22 లక్షల మందికి పైగా ప్రజలు నివాసం ఉంటున్నారు. ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధి చెందడమే కాకుండా.. విద్యా హబ్ గానూ, వాణిజ్య నగరంగానూ పేరొందింది. దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన అనేక విద్యా సంస్థలు విజయవాడ పరిసర ప్రాంతాల్లో నెలకొల్పడంతో.. అనేక ప్రాంతాల విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారు. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి రోజూ లక్షన్నరమంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండగా.. సిటీ బస్సుల ద్వారానే లక్ష మంది వరకు అనేక ప్రాంతాలకు వెళ్తుంటారు. ఇంతటి కీలకమైన ప్రాంతంలో ఆర్టీసీ సిటీ బస్సుల సేవలు తరచూ అర్థాంతరంగా ఆగిపోతున్నాయి.
సీఎం జగన్ సభకు ప్రజల నుంచి రాని స్పందన - ఆర్టీసీ ప్రయాణికులకు తప్పని తిప్పలు
People Facing Problems with CM Jagan Meetings: పేద, మధ్యతరగతి ప్రజలకు సేవలందించే ప్రగతి రథ చక్రాలను.. సీఎం జగన్ సభలకు తరలిస్తుండటంతో నగరంలో ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. విజయవాడ సహా సమీప ప్రాంతాల్లో 380 సిటీ బస్సులు నిరంతరం తిరుగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలోనే కాదు.. చుట్టుపక్కల 10 జిల్లాల్లో ఎక్కడైనా సీఎం జగన్ సభ ఉందంటే చాలు.. నగరంలో రవాణా అతలాకుతలం అవుతోంది. సీఎంఓ హుకూం మేరకు సమీప జిల్లాల్లో ఎక్కడ సభ జరిగినా.. ఇక్కడి బస్సులనే తరలిస్తున్నారు.