Bopparaju Venkateswarlu : ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి చాలా సమయం ఇచ్చామని ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. ఉద్యోగుల మలిదశ ఉద్యమం చాలా ఓర్పుతో సహనంతో సాగుతోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులంతా తమ న్యాయబద్ధమైన డిమాండ్ల కోసమే పోరాడుతున్నారని తెలిపారు.
సచివాలయంలో సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డిని కలిసి ఆయన మరోసారి వినతిపత్రం ఇచ్చారు. ఉద్యమం తీవ్రరూపం దాల్చితే అది మా బాధ్యత కాదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని బొప్పరాజు వ్యాఖ్యానించారు. న్యాయమైన డిమాండ్ల కోసం 47 రోజులుగా నిరసన తెలియజేస్తూనే ఉన్నామని పేర్కొన్నారు. రెండు సార్లు ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘంతో సమావేశాలు ఏర్పాటు చేసినా సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమావేశాలు కేవలం ఉద్యోగుల అంశాలు తెలుసుకోవటానికి నిర్వహించారు తప్పా.. వారి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం సమావేశాలను ఏర్పాటు చేయలేదని సీఎస్‌కు తెలిపినట్లు వివరించారు. ఉద్యోగుల సమస్యలు తెలుసుకోవటానికి సమావేశాలు నిర్వహిస్తే ఎందుకు సమస్యలు కాలేదని ప్రశ్నించారు.
ఏపీ ఎన్జీవోలు, ట్రేడ్ యూనియన్లతో 28 తేదీన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ఉద్యమంలో వారిని కూడా కలుపుకుని పోవాలని యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. తమ సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని.. 28తేదీన కార్మిక సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ఏపీ ఎన్జీవోల సంఘాలు కలిసి ఉద్యమాన్ని తీవ్ర స్థాయి తీసుకువెళ్తే దాని భాద్యత పూర్తిగా ప్రభుత్వానిదే అని అన్నారు. ఓపికతో, సహనంతో.. ప్రభుత్వానికి ఎంత సమయం ఇవ్వాలో అంతా సమయం ఇచ్చామని అందుకే ప్రభుత్వం భాద్యత వహించాలన్నారు. భవిష్యత్‌లో ప్రభుత్వం, ప్రజలు దీనిపై వారిని భాద్యులు చేయవద్దని కోరారు.
పీఆర్సీ అరియర్లు, డీఏ అరియర్లు పెండింగ్ లో ఉన్నాయని పాత అరియర్లు ఎప్పటికిస్తారో తెలియకుండా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రం తెలంగాణలో ప్రభుత్వం ఉద్యోగులకు ఆర్ధిక ప్రయోజనాలన్నీంటిని చెల్లించిందని తెలిపారు. సీపీఎస్ రద్దు అంశం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమ బద్దీకరణ ఇలాంటి వాటిపై ప్రభుత్వం ఇదిగో అదిగో వ్యవహరిస్తోందన్నారు. జీతాల పెంపును పట్టించుకున్న దాఖాలాలు లేవని మండిపడ్డారు. ఇలాంటి వాటిపై అలస్యం చేస్తే ఉద్యమం ఉధృతం అవుతుందే తప్పా.. పరిష్కారం కాదన్నారు.
ఇవీ చదవండి :