వృద్ధి రేటు పెరుగుదలపై ప్రభుత్వం వివరణ AP Govt On Agriculture Growth Rate : పంట ఉత్పత్తి రేటు, దిగుబడి, ప్రధాన పంటలలో అంతర పంటలు, సాగు కోసం మంచి వ్యవసాయ పద్ధతులన్నీ పాటిచడం వంటివి కలిపితే ఉత్పత్తి సాధ్యమైతుందని.. వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి జ్ఞాన సూత్రాలను వల్లె వేశారు. జాతీయ సరాసరి కన్నా రాష్ట్ర వృద్ధి రేటు 2శాతం ఎక్కువ అని గొప్పగా చెప్పారు. సాగు విస్తీర్ణం 16.26 లక్షల ఎకరాల్లో తగ్గడానికి గల కారణాలు ఏమిటో మంత్రి చెప్పలేకపోయారు. పోనీ ధరలు పంట ఉత్పత్తులకు ఘనంగా పెరిగాయా అంటే అది లేదు. అంతంతా మాత్రమే ధరలు పెరిగాయి.
అంతంతా మాత్రంగానే మద్దతు ధరలు : క్వింటాల్‌కు 300 నుంచి 400 తక్కువగా అమ్ముకుంటున్నామని, మద్దతు ధర దక్కడం లేదని, వరి రైతులు వాపోతున్నారు. పంట ప్రారంభ దశలో క్వింటాల్ 10వేలు పలికిన పత్తి.. ఇప్పుడు పంట చేతికి వచ్చిన తర్వాత 7 వేల రూపాయలకు కూడా కొనేవారు లేరు. సెనగల ధర కూడా మద్దతు కన్నా తక్కువే. పసుపు రైతులకు మద్దతు ధర కూడా దక్కక ఆవేదనే మిగిలింది. ఒక్క మిరప పంటకు మాత్రమే క్వింటాల్ 20 వేల రూపాయలకు పైగా చేరింది. అది తప్పితే అధికశాతం లోటు బాటలోనే నడుస్తున్నాయి. పత్తి దిగుబడి 2022-23 సంవత్సరంతో పోల్చితే తక్కువగానే వచ్చింది.
కరవు మండలాలపై ప్రభుత్వం : రాష్ట్రంలోని 273 మండలాల్లో 2022 ఖరీఫ్‌లో బెట్ట వాతావరణం ఉందని ఫ్యాక్ట్ చెక్‌లో ప్రభుత్వం తెలిపింది. అందుకే ఖరీఫ్ సాగు ఆలస్యమైందని.. 101 మండలాల్లో ఆగస్టు, సెప్టెంబరు నెలల మధ్య డ్రైస్పెల్స్ ఉన్నాయని పేర్కొంది. ఆ సమయంలో పంటల దిగుబడికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని, డ్రైస్పెల్ ఆధారంగా కరవు మండలాలు ప్రకటించలేమని తెలిపింది. వర్షాలు లేకపోవటం వల్లనే రాయలసీమతో పాటు ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో పత్తి దిగుబడులు భారీగా తగ్గాయి. ఎకరానికి కనీసం ఒకటి రెండు క్వింటాళ్ల దిగుబడి రాని రైతులు ఉన్నారు. అయినా ప్రభుత్వం రైతుల నష్టాన్ని పట్టించుకోలేదు. పనులు లేక రాయలసీమలో లక్షలాది కుటుంబాలు వలసల బాట పట్టాయి. వ్యవసాయ శాఖ మంత్రి కాకాణికి ఇవన్నీ కన్పించినట్లు లేవు.
అందుకే దిగుబడి పెరిగింది :కోనసీమ, పశ్చిమ గోదావరి, వైఎస్‌ఆర్, బాపట్ల జిల్లాల్లో రైతులు పంట విరామం ప్రకటించారనడం వాస్తవం కాదని పేర్కొన్న ప్రభుత్వం.. సాగు తగ్గిపోవడానికి గల కారణాలేమిటనే విషయాన్ని మాత్రం దాటవేసింది. చెరకు పంట సాగు 2019-20సంవత్సరంతో పోలిస్తే ఏకంగా 50శాతం వరకు పడిపోయినా ప్రభుత్వం ఉలుకూ పలుకు లేకుండా ఉండిపోయింది. అంతేకాకుండా సూక్ష్మ సేద్యం పథకాన్ని ప్రభుత్వం అటకెక్కించింది. 4.75లక్షల ఎకరాలను అదనంగా సాగులోకి తెచ్చామని, అందుకే పంటల దిగుబడి పెరిగిందని ఫ్యాక్ట్ చెక్‌లో పేర్కొంది. వాస్తవానికి 2022-23 సంవత్సరంలోనే సూక్ష్మసేద్యం పథకాన్ని అమలు చేయడం ప్రారంభించింది. దాని లక్ష్యం 3.75లక్షల ఎకరాలు కాగా.. లక్ష్యానికి సగం కూడా చేరలేదు. 14 వేల 402 పొలంబడి కార్యక్రమాలతో 4.30లక్షల మంది రైతులకు రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ ఇచ్చామని, అందుకే దిగుబడులు పెరిగాయని ప్రభుత్వం వివరించింది.
ఇవీ చదవండి :