AP government is increasing electricity charges: అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ విద్యుత్ ఛార్జీలు పెంచుతూ పోతున్న రాష్ట్ర ప్రభుత్వం.. గత ఏడాదిన్నరలోనే మూడుసార్లు వడ్డించింది. అధికారికంగా పెంచింది ఒక్కసారే అయినా... వేర్వేరు పేర్లతో భారాలు మోపింది. 36 నెలలకు గానూ విద్యుత్ ఛార్జీల పెంపు ద్వారా ఏటా 14 వందల కోట్లు, కనీస డిమాండ్ ఛార్జీల పేరుతో ఏటా 200 కోట్లు, ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో 2 వేల 910.74 కోట్ల రూపాయలు బాదేసింది. ఈ లెక్కన ఏడాదికి సగటున 2 వేల 600 కోట్ల చొప్పున ప్రజలపై భారం పడింది.
పాత టారిఫ్‌తో పోలిస్తే ప్రతి నెల వచ్చే విద్యుత్ బిల్లులు కొందరికి 40 నుంచి 50 శాతం మేర పెరిగాయి. సున్నా నుంచి 75 యూనిట్ల మధ్య వినియోగించే దిగువ మధ్యతరగతి వర్గాలపై 60 శాతానికి మించి ఛార్జీల భారం పెరిగింది. 2022 ఏప్రిల్ నుంచే విద్యుత్ ఛార్జీల పెంపు అమల్లోకి వచ్చినా... కొన్ని నెలలుగా అందుతున్న బిల్లులు చూసి వినియోగదారుల గుండెలు గుభేల్‌మంటున్నాయి. గృహ వినియోగదారుల టారిఫ్‌ను హేతుబద్ధీకరిస్తూ ఉమ్మడి టెలిస్కోపిక్ వ్యవస్థ ప్రవేశపెట్టామని, దీనివల్ల అందరికీ తక్కువ శ్లాబ్‌లో ఉండే రాయితీ ధరల ప్రయోజనం అందుతుందని... గత మార్చిలో కొత్త టారిఫ్‌ను ప్రకటించే సమయంలో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చెప్పింది. విద్యుత్ బిల్లులు వినియోగదారుల చేతికొచ్చాక కానీ ఆ మాటల్లోని పరమార్థం తెలిసిరాలేదు.
విజయవాడకు చెందిన ఒక వినియోగదారుడు.. అక్టోబర్‌లో వినియోగించిన 185 యూనిట్ల విద్యుత్‌కు కొత్త టారిఫ్ ప్రకారం విద్యుత్ ఛార్జీల రూపేణా 777 రూపాయలు, విద్యుత్ సుంకం 11 రూపాయల 10 పైసలు, కస్టమర్ ఛార్జీల కింద 50, కనీస డిమాండ్ ఛార్జీలుగా 20, ట్రూఅప్ ఛార్జీల కింద 45... మొత్తం కలిపి 903 రూపాయల బిల్లు వచ్చింది. ఇదే విద్యుత్ వినియోగానికి పాత టారిఫ్ ప్రకారమైతే... 627 రూపాయలు చెల్లిస్తే సరిపోయేది. ఛార్జీల పెంపు, ట్రూఅప్‌తో నెలకు 289 రూపాయల అదనపు భారం పడింది. పాత టారిఫ్‌తో పోలిస్తే 46.09 శాతం ఛార్జీలు పెరిగాయి.
నెలకు 202 యూనిట్ల విద్యుత్ వినియోగించే మధ్యతరగతి వినియోగదారుడిపై.. ఛార్జీల పెంపుతో నెలకు 342.56 రూపాయల అదనపు భారం పడింది. ఒకవేళ ఏడాదంతా ఇదే విధంగా విద్యుత్ వినియోగిస్తే... 4 వేల 110.72 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే... 305 యూనిట్లు వినియోగించే ఎగువ మధ్యతరగతి వినియోగదారుడిపై... నెలకు 257.4 రూపాయల వంతున ఏడాదికి 3 వేల 88.80 రూపాయల భారం పడుతుంది. పాత టారిఫ్‌తో పోలిస్తే వారిపై 15.48 శాతం భారం పెరిగింది.
ఇక నెలకు 405 యూనిట్లు వినియోగించే వారిపై ఛార్జీల వడ్డనతో నెలకు వచ్చే విద్యుత్ బిల్లు 362.65 రూపాయలు పెరిగింది. ఏడాదికి 4 వేల 351.80 రూపాయల భారం పడుతుంది. పాత టారిఫ్‌తో పోలిస్తే 14.70 శాతం అదనపు భారం అన్నమాట. అంటే... సామాన్య, మధ్యతరగతి వర్గాలపైనే ప్రభుత్వం ఎక్కువ భారం వేస్తోంది. రాష్ట్రంలోని మూడు డిస్కంల పరిధిలో సున్నా నుంచి 75 యూనిట్ల మధ్య విద్యుత్ వినియోగించే కనెక్షన్ల సంఖ్య 83.06 లక్షలు కాగా.... సున్నా నుంచి 225 యూనిట్ల లోపు వినియోగించేవారి సంఖ్య 58.16 లక్షలు. అలాగే 500 యూనిట్లు, అంతకుమించి విద్యుత్ వినియోగించే కనెక్షన్ల సంఖ్య 8.11 లక్షలు ఉన్నాయి.