Shivaratri celebrations across the state:శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తొమ్మిదో రోజు రాత్రి శ్రీభ్రమరాంబ, మల్లికార్జున స్వామి వార్ల తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. తెప్పను రంగురంగుల విద్యుత్ దీపాలు, పుష్పాలతో అలంకరించి పుష్కరిణిలో విహరింపజేశారు. కర్నూలు జిల్లా నందవరం మండలం గురుజాల రామలింగేశ్వరస్వామి రథోత్సవం ఘనంగా జరిగింది. శ్రీకాళహస్తి నారద పుష్కరణిలో జోడు తెప్పలపై కొలువైన ఆది దంపతులు... భక్తులకు అభయ ప్రదానం చేశారు. తెప్పోత్సవం తర్వాత దేవతామూర్తులు మాడవీధుల్లో విహరిస్తూ ఆలయానికి చేరుకున్నారు.
విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామివార్ల రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా కొబ్బరికాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, ఈఓ భ్రమరాంబ సహా పెద్దసంఖ్యలో భక్తులు పాల‌్గొన్నారు. కృష్ణా మొవ్వలోని పురాతన బాలాత్రిపురసుందరి సమేత భీమేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి శ్రీ దుర్గానాగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. స్వామివారి రథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.