ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Nandyal Development: నంద్యాల అభివృద్ధి ఎక్కడ జగనన్నా.. మురుగునీరు, తాగునీటి సమస్యలే..

CM Jagan to Nandhyala Development: మీ బిడ్డ మాట ఇచ్చాడంటే.. మడమ తిప్పడు అని గొప్పగా చెప్పుకునే ముఖ్యమంత్రి మాటలు.. నంద్యాల అభివృద్ధిపై ఏమాయ్యాయి..? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చినా హామీల అంశంలో ముఖ్యమంత్రి మాడమ తిప్పారా అని నంద్యాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు అభివృద్దిపై హామీలు ఇచ్చి ఇప్పుడు కనీసం పట్టించుకోవటం లేదని అంటున్నారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Jul 22, 2023, 12:21 PM IST

CM Jagan Promises to Nandhyala Development: ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాక 'పులివెందులపై ఎంత శ్రద్ధ పెడతానో అంతే శ్రద్ధ నంద్యాలపై కూడా చూపిస్తా.. నంద్యాల అభివృద్ధిని నాకొదిలేయండి పరుగులు పెట్టిస్తా. నంద్యాలను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్ది గుర్తింపు తెస్తా'. ఇవీ నంద్యాల ఉప ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నాయకుడిగా.. 2019 ఎన్నికల ప్రచారంలో వై.ఎస్. జగన్ ఇచ్చిన హామీలు. నంద్యాలకు రింగ్ రోడ్డు ఏర్పాటు చేయిస్తానని జగన్ సీఎం అయ్యాక మరో హామీని ఇచ్చారు. కానీ వీటిని ఆయన పూర్తిగా విస్మరించారు. గతంలో ఇచ్చిన హామీలు ఏవీ నెరవేరలేదు.

నంద్యాల నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగకపోగా మౌలిక వసతులు సైతం కరవై ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పేదలకు ఉచితంగా ఇళ్లను కట్టించి రిజిస్టర్ చేసిస్తామని జగన్ హామీ ఇచ్చారు. కొందరికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం మినహా ప్రభుత్వం ఇళ్ల నిర్మాణంపై దృష్టి నిలపలేదు. టీడీపీ హాయంలో ఎస్సార్బీసీ కాలనీలో 50 ఎకరాల్లో 890 కోట్ల రూపాయలతో టిడ్కో గృహాలు, వైఎస్సాఆర్ నగర్, అయ్యలూరు మెట్ట వద్ద పేదలకు అపార్టుమెంట్ల నిర్మాణాన్ని చేపట్టినా లబ్ధిదారులకు వాటిని వైసీపీ ప్రభుత్వం అప్పగించ లేదు.

నంద్యాలకు ఔటర్ రింగ్​రోడ్డు మంజూరు చేస్తున్నానని.. నంద్యాలలో గత ఏడాది ఏప్రిల్ 7న నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్​ హామీ ఇచ్చారు. ఈ అంశంలో ఇప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ రోడ్డుకు 100 కోట్ల రూపాయలతో రోడ్లు, భవనాల శాఖ పంపిన ప్రతిపాదన ప్రభుత్వం వద్దే పెండింగ్లో ఉంది.

నంద్యాలలోని పలు ప్రాంతాలు కొద్దిపాటి వర్షానికే నీట మునుగుతున్నాయి. పట్టణ నడిబొడ్డున ఉన్న పద్మావతినగర్ మురుగునీటి తటాకంగా మారుతోంది. పాత పట్టణంలో మద్దిలేరు వాగు విస్తరణ, కరకట్టల నిర్మాణం ఊసే లేదు. తరచూ ఈ ప్రాంతం ముంపునకు గురవుతోంది. నంద్యాల చిన్న చెరువును ట్యాంక్​బండ్​లా అభివృద్ధి చేస్తామని.. పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని చెప్పినా ఆ దిశగా చర్యలు లేవు. పట్టణంలో మురుగునీటి కాలువల నిర్మాణాన్ని కూడా చేపట్టలేదు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ప్రతిపాదన గురించి పట్టించుకునే వారు కరవయ్యారు. పట్టణ శివార్లలో పీవీ నగర్ డంప్ యార్డులో చెత్తను శుద్ధి చేసి.. ఎరువుగా మార్చి రైతులు, సిమెంట్ పరిశ్రమలకు ఇచ్చే ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.

బొమ్మల సత్రం నుంచి నూనెపల్లె ఉపరితల వంతెన వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి.. మూడేళ్ల కిందట 13.40 కోట్ల రూపాయల అంచనాతో టెండర్లు పిలిచి గుత్తేదారుకు పనులు అప్పగించారు. ఇందులో భాగంగా మురుగు కాలువల నిర్మాణాన్ని ప్రారంభించినా ఆ పనులూ ఆరు నెలల క్రితం నిలిచిపోయాయి. కుందూ నదిపై వంతెన నిర్మాణ పనులు టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైనా.. వైసీపీ ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో నిలిచిపోయాయి. ప్రతి ఇంటికీ రక్షిత నీటిని సరఫరా చేస్తామని ఉప ఎన్నికల సమయంలో జగన్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం నంద్యాలలో రెండు రోజులకోసారి తాగునీరు సరఫరా అవుతోంది.

టీడీపీ హయాంలో అమృత్ పథకం కింద వెలుగోడు రిజర్వాయరు నుంచి నేరుగా నంద్యాలకు తాగునీటి పైపులైన్ ఏర్పాటు చేసే పనులు ప్రారంభించారు. ప్రభుత్వం మారే సమయానికి 30 శాతం పనులు మిగిలి ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చి నాలుగేళ్లయినా ఆ పనులు ఇంకా పూర్తి కాలేదు. నంద్యాలలో వ్యవసాయ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని గతంలో జగన్ హామీ ఇచ్చినా ఈ నాలుగేళ్లలో దాని ఊసే లేదు.

మరో వైపు 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన (ఆర్ఎఆర్ఎస్) కేంద్రాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. ఏడాది కిందట ఇక్కడే జిల్లా కలెక్టరేట్​ను ఏర్పాటు చేశారు. ఆర్ఎఆర్ఎస్ భూములు 50 ఎకరాలను వైద్య కళాశాలకు బదలాయించారు. కేసీ కెనాల్ ఆయకట్టును స్థిరీకరిస్తామని జగన్ హామీ ఇచ్చినా నెరవేరలేదు జిల్లాలో 2.50 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇప్పటికీ చివరి ఆయకట్టుకు నీరు సరిగ్గా అందని పరిస్థితి నెలకొంది. కేసీ కెనాల్ తూము ఏర్పాటు చేయక పోవడంతో గోస్పాడు మండలం జిల్లెల నుంచి పసురపాడు వరకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details