శ్రీశైలం దేవస్థానానికి 4వేల 700 ఎకరాల అటవీ భూమి Devadaya sakha Minister Kottu satyanarayana comments: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం దేవస్థానానికి వివాదంలోని 4,700 ఎకరాల అటవీ భూమి చెందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమవేశంలో ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు.
1:2 నిష్పత్తిలో మార్పులు:శ్రీశైలం దేవస్థాన అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే అటవీ, రెవెన్యూ శాఖల మంత్రులతో, ఉన్నతాధికారులతో, దేవస్థానం అధికారులతో చర్చలు జరిపినట్లు మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. దేవాదాయ భూముల విషయంలో ఇప్పటికే డిమార్కేషన్ చేసి 1:2 నిష్పత్తిలో మార్పులు చేశామన్నారు. ఆలయ భూముల సరిహద్దులకు సంబంధించి ఫెన్సింగ్ కూడా వేయాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు
మూడు వేల ఆలయాల అభివృద్ధి:అనంతరం రాష్ట్రంలో ఈ ఏడాది మూడు వేల ఆలయాలను అభివృద్ధి చేస్తామన్నారు. ఒక్కో దేవాలయానికి 10 లక్షల రూపాయల నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. నైవేద్యాలు, ప్రసాదం పోటు నిర్వహణ సామాగ్రి కోసం నిర్వహించే టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా చేపడతామని మంత్రి స్పష్టం చేశారు. శ్రీశైలంలో ఆర్టీసీ డిపో కోసం 4 ఎకరాలు కేటాయించామన్నారు. ప్రతి దేవాలయానికి సంబంధించి పారదర్శక విధానంలో మూడు రకాల టెండర్లను పిలుస్తామని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.
నమూనాలను రహస్యంగా ల్యాబ్‌కు పంపిస్తాం:గతంలో ఆగమశాస్త్రానికి అనుగుణంగా దేవుడికి సమర్పించే నైవేద్యాలు, ప్రసాదం పోటు సంబంధించిన సామాగ్రి టెండర్ల విషయంలో అన్నింటికి ఒకే టెండర్ ప్రక్రియ ఉండేదని.. ఇప్పుడు ప్రసాదం పోటుకు, అన్నదానానికి విడివిడిగా టెండర్ల ప్రక్రియ చేపట్టనున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఏయే దానికి ఎంతెంత సామాగ్రి కావాలన్న అంశంపై విడిగా టెండర్లను పిలుస్తామన్నారు. ప్రసాదం, అన్నదానం వంటి అంశాలకు సంబంధించిన నాణ్యతను పరీక్షించేందుకు ప్రతి కమిషనరేట్‌లో క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ ఉండేలా చర్యలు చేపడతామన్నారు. నమూనాలను సేకరించి వాటిని పరీక్షల నిమిత్తం ఎవరికీ తెలియకుండా రహస్యంగా క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్‌కు పంపిస్తామన్నారు. పరీక్షల అనంతరం నాణ్యతలో తేడా వస్తే సదరు కాంట్రాక్టర్ నుంచి రికవరీ చేపట్టేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.
ఇప్పటివరకూ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కి, ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్‌కి, టెంపుల్‌కి సంబంధించిన ఒక డిస్ట్‌బ్యూట్ రూపంలో ఒక అట్‌మస్ ఫీయర్ నడుస్తోంది. అందరం కూర్చోని ఒక కన్‌క్లూషన్‌కు వచ్చి చర్చలు జరిపాము. దేవాలయానికి సంబంధించి 4,700 ఎకరాలను ఐడెంటిఫై చేసి డిమార్కేషన్ చేశాం. దానికి మార్పులు, చేర్పులు కావాలంటే కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ ప్రకారం చేస్తాం. -కొట్టు సత్యనారాయణ, దేవాదాయ శాఖ మంత్రి
ఇవీ చదవండి