"బకాయిల వ్యథ.. తీరేదీ ఎన్నడో".. సొమ్ముల కోసం కోర్టు మెట్లెక్కుతున్న వైనం Protest To Pay Pending Bills : జగన్ సర్కారులో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో బాధితులయ్యారు. ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్థమైన రాష్ట్ర ప్రభుత్వంలో చిన్న బిల్లు చేతికి అందాలన్నా కష్టమయిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద డిసెంబరు నాలుగో వరకు ఉన్న సమాచారం మేరకు 30 వేల కోట్లకు పైగా బిల్లులు పెండింగులో ఉన్నాయి. అవి ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలో సమర్పించిన బిల్లులు మాత్రమే.
బడ్జెట్ ఆమెదాలతో ముగిసిపోతున్న బిల్లుల కథ: జగన్ సర్కార్ వచ్చిన తర్వాత ఏళ్ల తరబడి ఎన్నో బిల్లులు పెండింగులో ఉన్నాయి. ఏ ఏటికాయేడు ఆ ఆర్థిక సంవత్సరంతో బడ్జెట్ ఆమోదాలు, పెండింగు బిల్లులు కథ ముగిసిపోతోంది. ఆ తదుపరి బడ్జెట్‌కు వాటిని తీసుకువెళ్లడం లేదు. దీంతో పాత సంవత్సరం బిల్లులు మళ్లీ సమర్పించాలంటే బడ్జెట్ కేటాయింపులు, విడుదల ఉత్తర్వులు ఉండాల్సిందే. ఆ బడ్జెట్ కేటాయింపులు లేక పాత బిల్లులు సమర్పించేందుకు ఆస్కారం లేకుండా ఉన్నవారెందరో. అసలు మొత్తం పెండింగు బిల్లు ఎంత ఉందో సాక్షాత్తూ ఆర్థికశాఖ ఉన్నతాధికారులు కూడా వెల్లడించడం లేదు.
బిల్లు కోసం ఎక్కే మెట్టుతో.. దిగే మెట్టుతో అలసిపోయిన వ్యథ: అత్యంత సామాన్యుల నుంచి చిన్న చిన్న గుత్తేదారుల వరకు ఎందరో ప్రభుత్వ బిల్లుల బాధితులు. ఒక్కొక్కరిదీ ఒకో బాధ.. బిల్లు కోసం ఎక్కే మెట్టు, దిగే మెట్టుతో అలసిపోయిన వ్యథ. సత్యసాయి జిల్లా పుట్టపర్తికి చెందిన ఈమె పేరు సత్యవతి. గోదావరి హోటలు నిర్వాహకురాలు. కొవిడ్ సమయంలో రోగులకు భోజనం సరఫరా చేయాలని.. 15 రోజులకు ఒకసారి బిల్లులు చెల్లిస్తామని అధికారులు చెప్పారు.
ఆ మాటలను నమ్మిన ఈమె.. 2021లో కొవిడ్ రోగులకు భోజనం సరఫరా చేశారు. దానికి సంబంధించిన బిల్లులు 7 లక్షల 19 వేలు మంజూరు చేయాలని రెండేళ్లుగా ప్రదక్షిణలు చేస్తున్నా.. అధికారులు కనికరించడం లేదని వాపోయారు.బిల్లులను మంజూరు చేయని పక్షంలో ఆత్మహత్యే శరణ్యమని సత్యవతి ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నిసార్లు విన్నవించినా అదే పరిస్థితి: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరానికి చెందిన ఓ హోటల్ నిర్వాహకురాలికి సైతం ఇంకా ప్రభుత్వం నుంచి 38 లక్షలు రావాల్సి ఉంది. ఎన్నిసార్లు విన్నవిస్తున్నా బిల్లు రావకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఇందుకు సంబంధించిన పెండింగు బిల్లులు 1,100 కోట్లు. ఇవి కాకుండా కోవిడ్ ఆస్పత్రులకు, ఆరోగ్య కేంద్రాలకు అవసరమైన యంత్రసామాగ్రి ఇతరాలు కొందరు గుత్తేదారులు సరఫరా చేశారు.
హైకోర్టును ఆశ్రయించిన తర్వాతే బిల్లులు చెల్లింపులు: ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ద్వారా 500 కోట్లు చెల్లింపులు చేయాల్సి ఉంది. కొవిడ్ సమయంలో తాత్కాలికంగా కొందరు వైద్య, సంబంధిత సిబ్బందిని నియమించారు. వారికి వేతనాలు ఎప్పటి నుంచో పెండింగులో ఉంచారు. వారు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించిన తర్వాతే 50 కోట్లు చెల్లింపులు జరిగాయి. కమ్యూనిటీ వైద్య అధికారులకు కూడా ఎప్పటి నుంచో వేతనాలు పెండింగులో ఉన్నాయి.
బిల్లులు ఇవ్వకపోవడంతో ఫ్లోరింగ్ నిలుపుదల: కర్నూలు జిల్లా పోలూరు పంచాయతీలో 28 లక్షలతో సచివాలయ భవన నిర్మాణ పనులు చేపట్టారు. ప్రభుత్వం చెల్లించాల్సిన 4 లక్షల బిల్లులు ఇవ్వకపోవడంతో గుత్తేదారు ఫ్లోరింగు పనులు ఆపేశారు. రాష్ట్రం మొత్తం మీద గ్రామ పంచాయతీల్లో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు ఆరోగ్య క్లీనిక్కులు తదితర భవనాల పనులు 8,953.26 కోట్లతో చేపట్టారు. ఈ పనులకు సంబంధించి దాదాపు 518 కోట్లు బిల్లులు పెండింగులో ఉన్నాయి. దీంతో పంచాయతీల్లో పనులు వేగంగా సాగడం లేదు.
కర్నూలులో వైసీపీ నాయకుడి నిరసన: తాగునీటి పథకం నిర్వహణకు వెచ్చించిన బిల్లులు మంజూరు చేయాలంటూ వైసీపీ నాయకుడు వీరారెడ్డి బుధవారం కర్నూలు జిల్లా ఆదోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో చెట్టు కింద కూర్చొని నిరసనకు దిగారు. గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి లక్షలు పెండింగ్‌లో ఉన్నాయని.. దీంతో ఇబ్బందులు పడుతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు వైసీపీ నేతలు, సర్పంచులు వీరారెడ్డికి బుజ్జగించి ఆందోళనను విరమింపజేశారు. బిల్లుల పెండింగ్‌పై ఏఈని వివరణ కోరగా.. బిల్లుల చెల్లింపులకు సంబంధించిన పత్రాలను తమకు సమర్పించలేదని చెప్పారు.
బిల్లులు చెల్లించాలని హైకోర్టును ఆశ్రయిస్తున్న బాధితులు: రాష్ట్రంలో పరిస్థితుల నేపథ్యంలో బిల్లులు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వండి అంటూ అనేక మంది హైకోర్టును ఆశ్రయించారు. అక్కడి నుంచి ఆదేశాలు తెచ్చుకుంటున్నారు. అప్పటికీ చెల్లింపులు జరపకపోవడంతో కోర్టు ధిక్కరణ కేసులు దాఖలు చేస్తున్నారు. ఆయా కేసుల్లో జలవనరులశాఖ అధికారులతో సహా అనేక మంది రాష్ట్ర హైకోర్టుకు హాజరుకావాల్సి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, ఐఏఎస్ అధికారులు సైతం న్యాయస్థానానికి హాజరై సమాధానం చెప్పవలసి వస్తోంది. కొన్ని చోట్ల అధికారులే తాము ఏమీ చేయలేమంటూ బిల్లుల కోసం కోర్టులకు వెళ్లండి అంటూ సలహాలు ఇస్తున్న ఉదంతాలూ ఉన్నాయి.
ధిక్కారణ పిటిషన్లు దాఖలు చేసిన రైతులు: గత ప్రభుత్వ హయాంలో నీరు చెట్టు పనులు చేపట్టిన బిల్లులు ఇప్పటికీ చెల్లించలేదు. నీటి సంఘాల తరపున ఈ పనులు చేపట్టారు. ఇప్పటికీ 731 కోట్ల బిల్లులు పెండింగులోనే ఉన్నాయి. మొత్తం 6,210 మంది రైతులు గతంలోనే హైకోర్టును ఆశ్రయించగా ఆరువారాల్లో వారికి సొమ్ములు చెల్లించాలని ఆదేశాలు వచ్చాయి. అప్పటికీ చెల్లింపులు చేయకపోవడంతో 3,200 మంది రైతులు ధిక్కార పిటిషన్లు దాఖలు చేశారు. 2022 డిసెంబరు వరకు జలవనరులశాఖ 546.17 కోట్లు విడుదల చేసి రైతుల ఖాతాల్లో 375 కోట్లే జమ చేశారు. ఆ తర్వాత మరో 513 ధిక్కార కేసులకు సంబంధించి 94.85 కోట్లు విడుదల చేసింది. ఈ పనులు చేసిన వారంతా చిన్న చిన్న వారేనని గమనించి మిగిలిన 731 కోట్ల బిల్లులు విడుదల చేయాలని పనులు చేసిన వారు కోరుతున్నారు.
ఏపీఎండీసీ కార్యాలయం చుట్టూ తిరిగిన నో బిల్స్: బి.సాయికుమార్.. ఒక కనస్ట్రక్షన్ కంపెనీ యజమాని. 2021 మే నెలకు ముందు ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోనే ఇసుక తవ్వకాలు, రవాణా ద్వారా అమ్మకాలు జరిగాయి. ఈ పనులు అప్పట్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో వీరి కంపెనీ ఆరు రీచ్‌లు తీసుకుని చేసింది. అప్పట్లో ఇసుక తవ్వినందుకు, రవాణా చేసినందుకు వీరికి 2.50 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఏపీఎండీసీ కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం ఉండటం లేదని సాయికుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ డబ్బులే కాదు- ఈ పని ఒప్పందం కింద చెల్లించిన సెక్యూరిటీ డిపాజిట్టు సొమ్ములు 20 లక్షలు కూడా ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు. ఇలాంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో ఉన్నారు. మొత్తం 150 మంది చిన్న చితకా గుత్తేదారులకు 100 కోట్ల వరకు బిల్లులు పెండింగులో ఉన్నాయి.
ఇవి కాకుండా రహదారులు భవనాలశాఖ బ్యాంకు ఆఫ్ బరోడా నుంచి 2,000 కోట్ల రుణం తీసుకుని రోడ్ల నిర్మాణం చేపట్టింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద 205 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఆ వాటా సొమ్ములు ఎప్పటి నుంచో ఇవ్వకపోవడం వల్ల బ్యాంకు చివరి విడత రుణం ఇవ్వడం ఆపేసింది. దీంతో బిల్లుల చెల్లింపు కొంత మేర నిలిచిపోయింది.
మార్క్‌ఫెడ్‌కు అందని బిల్లులు: రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువుల అమ్మకాలు చేపట్టినందుకు, పంట ఉత్పత్తులు కొనుగోలు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌కు 650 కోట్ల వరకు చెల్లింపులు చేయాల్సి ఉంది. మార్క్‌ఫెడ్ రుణాలు తీసుకువచ్చి ఈ కార్యకలాపాలు నిర్వహించగా ఆ సొమ్ములు ఇంతవరకు ప్రభుత్వం నుంచి రాలేదు. ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు కింద మూడేళ్ల నుంచి 190 కోట్లు ప్రభుత్వం నుంచి బకాయిలు రావాల్సి ఉంది. వివిధ చిన్న చిన్న కంపెనీలు సరఫరా చేసిన పరికరాల నిమిత్తం ఈ మొత్తాలు చెల్లించాలి.
ట్రాక్టర్లు, సూక్ష పోషకాలు, ఆయిల్‌పామ్, పట్టు విభాగాల్లో పంట సాగు రాయితీ మొత్తాలు, రైతు భరోసా కేంద్రాలకు పురుగుమందుల సరఫరా నిధులు, రైతు భరోసా కేంద్రాల అద్దెలు వంటివి అన్నీ కలిపి వ్యవసాయ, ఉద్యానవనశాఖల్లో 1,000 కోట్లకు పైగానే బకాయిలు ఉన్నట్లు సమాచారం. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల్లో ప్రోత్సాహకాల కింద 800 కోట్ల వరకు ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇవి కాక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేల కోట్లలోనే ప్రభుత్వం బకాయి పడింది.
ఇవీ చదవండి: