ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

POWER WAR: ఇరురాష్ట్రాల మధ్య విద్యుత్​ పంచాయితీగా మారిన జల వివాదం - telangana varthalu

తెలుగు రాష్ట్రాల మధ్య నీటిపంచాయితీ విద్యుత్ పంచాయితీగా మారింది. శ్రీశైలంలో వీలైనంత ఎక్కువగా జలవిద్యుత్ ఉత్పత్తి చేసేందుకు తెలంగాణ సిద్ధమవుతోంది. అటు అక్కడ నీటి జలవిద్యుత్ ఉత్పత్తిని ఆపాలని ఏపీ అంటోంది. ఏపీ ఫిర్యాదుపై స్పందించిన కృష్ణాబోర్డు విద్యుత్ ఉత్పత్తి కోసం నీరు విడుదల చేయవద్దని తెలంగాణకు తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో వందశాతం విద్యుత్​ను ఉత్పత్తి చేయాలని జెన్‌కోను ఆదేశిస్తూ ఇంధనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

water disputes between ap, ts
water disputes between ap, ts

By

Published : Jun 29, 2021, 7:15 AM IST

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా నదీ జలాల వివాదం కొనసాగుతూనే ఉంది. రాయలసీమ ఎత్తిపోతలపై పరస్పర విమర్శలు కొనసాగుతున్నాయి. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు సంగమేశ్వరం ప్రాంతాన్ని పరిశీలించేందుకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు సిద్ధమవుతోంది. వచ్చే నెల 12వ తేదీలోగా ఎన్జీటీకి నివేదిక ఇవ్వాల్సి ఉంది. వీలైనంత త్వరగా అక్కడకు వెళ్లి నివేదిక ఇవ్వాలని బోర్డుకు కేంద్ర జలశక్తి శాఖ ఇప్పటికే సూచించింది. దీంతో అక్కడకు బృందాన్ని పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అటు రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ వివాదం కూడా ప్రారంభమైంది. శ్రీశైలం జలాశయంలో కనీస నీటిమట్టం ఉన్నప్పటికీ తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని... వెంటనే ఆపాలని ఏపీ ప్రభుత్వం ఈ నెల పదో తేదీన కృష్ణా బోర్డును కోరింది. దానిపై స్పందించిన బోర్డు... గ్రిడ్​కు సంబంధించిన అత్యయిక పరిస్థితి ఉంటే తప్ప శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి నీటి విడుదల ఆపాలని తెలంగాణకు స్పష్టం చేసింది.

కృష్ణా బోర్డు ఆదేశం

అనుమతులు లేకున్నా, ఎన్జీటీ ఆదేశాలను ఉల్లంఘించి మరీ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పనులు కొనసాగిస్తోందని ఈ నెల 19వ తేదీన తీవ్ర ఆక్షేపణ తెలిపిన తెలంగాణ మంత్రివర్గం... రాష్ట్రంలో పూర్తి స్థాయిలో జలవిద్యుత్ ఉత్పత్తి చేపట్టి ప్రాజెక్టులకు సరఫరా చేయాలని జెన్​కోను ఆదేశించింది. అటు ఏపీ మరోమారు జలవిద్యుత్ ఉత్పత్తి విషయమై తెలంగాణపై కృష్ణాబోర్డుకు ఈ నెల 23న ఫిర్యాదు చేసింది. శ్రీశైలం జలాశయంలో నీరు కనీస వినియోగ మట్టమైన 834 అడుగుల కంటే దిగువన ఉందని... 8.98 టీఎంసీల ఇన్ ఫ్లో వస్తే అందులో 34 శాతం 3.09 టీఎంసీలను విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించుకుందని పేర్కొంది. జలాశయంలో నీటిమట్టం 854 అడుగుల వరకు వచ్చే వరకు విద్యుత్ ఉత్పత్తి ఆపేలా చూడాలని కోరింది. ఆంధ్రప్రదేశ్ ఫిర్యాదు నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి కోసం నీటి వినియోగాన్ని తక్షణమే ఆపాలని కృష్ణా బోర్డు తెలంగాణ జెన్​కోను ఆదేశించింది.

జలవిద్యుత్ ఉత్పత్తికి సర్కారు ఆదేశం

మరోవైపు తెలంగాణ ప్రభుత్వం జలవిద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర రైతుల అవసరాల దృష్ట్యా సంపూర్ణ సామర్థ్యం మేరకు జలవిద్యుత్ ఉత్పత్తి చేయాలని జెన్​కోను ఆదేశించింది. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఇంధనశాఖ ఉత్తర్వులు వెలువరించింది. దాదాపు 2500 మెగావాట్ల విద్యుత్​ను నీటి ద్వారా ఉత్పత్తి చేయాలని స్పష్టం చేసింది. ఏపీ ఫిర్యాదులు, కృష్ణా బోర్డు ఆదేశాల నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి ఆవశ్యకతను వివరిస్తూ సమాధానం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ఇదీ చదవండి: Hydel Power : జలవిద్యుత్ ఉత్పత్తిపై తెలంగాణ దృష్టి

ABOUT THE AUTHOR

...view details