FARMERS AFFECTED BY UNTIMELY RAINS : రాష్ట్రంలో బుధవారం కురిసిన అకాల వర్షాలు అన్నదాతల ఆశల్నిముంచేశాయి. కర్నూలు, నంద్యాల జిల్లాలో పంట చేతికొచ్చిందని అప్పులు తీరతాయని భావించిన మిరప రైతుల తలరాత తెల్లారేసరికే మారిపోయింది. కల్లాల్లో ఎండబెట్టిన పంట నీటిలో తేలియాడటంతో రైతులు నిండా నష్టపోయారు.
135 మి.మీ. వర్షపాతం :అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచాయి. మిరప రైతుల ఆశలను అడియాశలు చేశాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో బుధవారం తెల్లవారుజాము నుంచి కుండపోతగా కురిసిన వానలతో మిరప, ఇతర ఉద్యాన పంటలకు తీరని నష్టం వాటిల్లింది. రాష్ట్రంలోనే అత్యధికంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 135 మి.మీ. వర్షపాతం నమోదైంది. గంటల వ్యవధిలో కురిసిన వానలతో పొలాలు వాగులను తలపించాయి.
చెదిరిపోయిన రైతుల కల :అనంతపురం, వైఎస్ఆర్, పల్నాడు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోనూ వర్షాలు కురిశాయి. బుధవారం రోజంతా రాయలసీమ వ్యాప్తంగా వర్షాల ప్రభావం కొనసాగుతూనే ఉంది. ఒకటి రెండు రోజుల్లో మిరప అమ్మితే చేతికి సొమ్ము వస్తుందని, అప్పులు తీరతాయని ఆశించిన రైతుల కల ఒక్క రాత్రిలో చెరిగిపోయింది.
" రెండు ఎకరాలు మిరప పంట వేశాము. అకాల వర్షం రావటం వల్ల 150 మంది కోసిన పంట పోగోట్టుకున్నాము. రెండు రోజుల్లో మార్కెట్కు తీసుకుపోవాల్సింది. వానలు రావటం వల్ల వాగులు, వంకలల్లోకి కొట్టుకుపోయింది. దాదాపు 10 మంది కూలీలను పెట్టుకోని మిరపను వేరుకుంటున్నాము. ఒక ఎకరానికి 2 లక్షలు పెట్టుబడి పెట్టినాము. 5 లక్షల వరకు నష్టం వచ్చింది. ప్రభుత్వం ఆదుకుంటేనే మేము బతకగలం. " - మిరప రైతు