కర్నూలు జిల్లా నంద్యాల-పాణ్యం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి చెందారు. మరో వ్యక్తి గాయపడ్డాడు. తండ్రి కొన్న నూతన ద్విచక్రవాహనాన్ని నడుపుతూ ఇద్దరు కొడుకులు మరో వ్యక్తితో కలిసి నంద్యాలకు వెళ్లారు. బట్టలు కొనుగోలు చేసి తిరిగి ఇంటికి ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అన్నదమ్ములిద్దరూ మృత్యువాత పడ్డారు. బైక్ కొనుగోలు చేసిన ఆనందం కొంతసేపైన ఆ కుటుంబానికి ఉండకుండానే దుర్ఘటన చోటు చేసుకుంది.
అసలెలా జరిగింది..?
పాణ్యం చెంచుకాలనీకి చెందిన అంకన్న (24), సుంకన్న(17) అనే అన్నదమ్ములు కొత్త ద్విచక్రవాహనంపై నాగరాజు అనే వ్యక్తితో కలిసి పాణ్యం వెళుతున్నారు. అర్జీఎం ఇంజనీరింగ్ కళాశాల వద్ద జాతీయరహదారిపై డివైడర్ ఢీకొన్నారు. దీంతో సుంకన్న అక్కడికక్కడే మృతి చెందగా. గాయపడ్డ అంకన్న సమీపంలోని శాంతిరామ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నాగరాజు అనే మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆ కుటుంబంలో విషాదం నింపింది. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.