TSRTC Special Buses for Sankranthi : సంక్రాంతి పర్వదినం సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ 4,233 ప్రత్యేక బస్సులను నడిపిస్తుందని రంగారెడ్డి రీజియన్ మేనేజర్ శ్రీధర్ పేర్కొన్నారు. ప్రత్యేక బస్సులకు ఎలాంటి అదనపు ఛార్జీలను వసూలు చేయడం లేదని, సాధారణ ఛార్జీలే తీసుకుంటామని స్పష్టం చేశారు. సంక్రాంతిని పురస్కరించుకుని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 2,720 బస్సులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1,356 బస్సులు, కర్ణాటక రాష్ట్రానికి 101 బస్సులు, మహారాష్ట్రకు 56 బస్సులను నడిపిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎంజీబీఎస్‌లోని రంగారెడ్డి ఆర్ఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆర్.ఎం.శ్రీధర్ సంక్రాంతి బస్సుల వివరాలను వెల్లడించారు.
ఈ నెల 10 నుంచి 14 వరకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నామని శ్రీధర్ పేర్కొన్నారు. జేబీఎస్ నుంచి 1,184 బస్సులు, ఎల్బీనగర్ నుంచి 1,133 బస్సులు, ఆరాంఘర్ నుంచి 814 బస్సులు, ఉప్పల్ నుంచి 683 బస్సులు, కేపీహెచ్‌బీ నుంచి 419 బస్సులను నడిపిస్తున్నామని తెలిపారు.