TSRTC launched express parcel service: తెలంగాణ రాష్ట్రంలో వినియోగదారులకు మరింత వేగవంతమైన సేవలందించేందుకు "ఏఎం 2 పీఎం" పేరిట నూతనంగా ఎక్స్‌ప్రెస్ పార్శిల్ సర్వీస్‌ను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ బస్ భవన్‌లో ఈ సేవలను టీఎస్‌ఆర్టీసీ సీఎండీ వీసీ సజ్జనార్ లాంఛనంగా ప్రారంభించారు. సంస్థ ఉన్నతాధికారులతో కలిసి "ఏఎం 2 పీఎం" పేరిట సర్వీస్ బ్రోచర్ ఆవిష్కరించారు.
TSRTC AM to PM parcel service : ప్రయాణికుల టికెట్ ఆదాయంతోపాటు ఇతర ప్రత్యామ్నాయ ఆదాయాల మార్గాలపై సంస్థ దృష్టి పెట్టిన తరుణంలో పెట్రోల్ బంక్‌ల నిర్వహణ, లాజిస్టిక్‌తోపాటు స్వచ్ఛమైన జీవా వాటర్ బాటిళ్లను మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. 2022 జూన్‌లో శ్రీకారం చుట్టిన కార్గో సేవలు ద్వారా అద్భుతమైన సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఆ సేవలు వినియోగదారులకు మరింత వేగంగా సురక్షితంగా అందించాలనే ఉద్దేశంతో.. ‘AM 2 PM’ సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నిన్నటి నుంచి సేవలు అందుబాటులోకి వచ్చాయి.
సాధారణంగా "ఏఎం 2 పీఎం" ఎక్స్‌ప్రెస్ పార్శిల్ సర్వీస్‌లో మధ్యాహ్నం 12 గంటల్లోపు బుక్ చేస్తే... అదే రోజు రాత్రి 9 గంటలకు ఆ పార్శిల్ గమ్యస్థానానికి చేరుతుంది. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9 గంటల మధ్యలో బుక్ చేస్తే మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు ఆ పార్శిల్ వెళ్తుంది. ఆ ప్యాకెట్ లేదా పార్శిల్ విలువ 5 వేల రూపాయలకు మించకూడదు. నగదు, యూపీఐ పేమెంట్స్ రూపంలో.. సేవలు పొందవవచ్చని ఆ సంస్థ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.