కర్నూలు నగరంలో రోజురోజుకు వాహనాలు పెరుగుతున్నాయి. సుమారు 5 లక్షల జనాభా ఉండగా... 2.68 లక్షల ద్విచక్రవాహనాలు, 30 వేలకు పైగా ఆటోలు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఉదయం విద్యార్థులు, ఆ తర్వాత ఉద్యోగులు, ఇతర కారణాలతో రాకపోకలు సాగించేవారితో... ఉదయం 9 గంటల నుంచే నగరంలో... ట్రాఫిక్ సమస్య షురూ అవుతోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో...వాహన రద్దీ మరింత పెరుగుతోంది.
ట్రాఫిక్ తెచ్చిన మంట...వాహనదారుల తంట! నగరంలోని రాజ్‌విహార్ సెంటర్, బళ్లారి చౌరస్తా, కొత్తబస్టాండ్, బంగారుపేట, మౌర్యాఇన్, పెద్దాసుస్పత్రి సర్కిల్, విశ్వేశ్వరయ్య సర్కిల్, ఆర్‌ఎస్ రోడ్డు, ఎస్‌బీఐ సర్కిల్, కొండారెడ్డి బురుజు, గడియారం ఆసుపత్రి, అబ్దుల్లాఖాన్ ఎస్టేట్, పూలబజార్, మండిబజార్, వన్‌టౌన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది.
చర్యలతోనే ఇబ్బంది! ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించటం సహా...వాహన రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చేయాలన్న ఉద్దేశంతో...నగరంలో కొన్ని చోట్ల డివైడర్లను మూసేయటం, యూ టర్న్‌లు తీసేయటం లాంటివి చేశారు. పలు కూడళ్లలో... ట్రాఫిక్ సిగ్నళ్లు ఏర్పాటు చేశారు. వీటి వల్ల ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందని భావించారు. ఇక్కడే అసలైన సమస్య. గతంలో కేవలం రాజ్ విహార్ కూడలిలోనే వాహన చోదకులు ఎక్కువసేపు వేచి ఉండేవారు. ఇప్పుడు అనేక ప్రాంతాల్లో సమస్య మరింత తీవ్రమైంది. సాఫీగా సాగిపోవాల్సిన చోట్ల... సిగ్నళ్ల కారణంగా... అరగంట వరకు ఎండలో ఉండాల్సి వస్తోంది.
ఒకప్పుడు 20 నిమిషాలే! గతంలో నంద్యాల చెక్ పోస్టు నుంచి పాత బస్టాండ్ వరకు 20 నిమిషాల్లో వెళ్లేవారు. ఇప్పుడు 40 నిమిషాల నుంచి గంటసేపు పడుతోంది. బళ్లారి చౌరస్తా నుంచి కొండారెడ్డిబురుజు వెళ్లాలంటే... అరగంటపైనే పడుతోంది. విద్యార్థులు, ఉద్యోగులు గంట ముందుగానే బయలుదేరాల్సి వస్తోంది. నగరంలో రోడ్ల విస్తరణ చేపట్టడం, అనవసరమైనచోట్ల సిగ్నళ్లు తొలగించటం, పార్కింగ్ ఏర్పాట్లు చేయడం చేస్తే..ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపినట్లు అవుతుందని నిపుణులు చెబుతున్నారు.