అన్న క్యాంటీన్ల మూసివేతపై ఆగ్రహం... తెదేపా నిరసన గళం - tdp
వైకాపా అధికారంలోకి వచ్చాక తెదేపా ప్రభుత్వం తొలిసారిగా ప్రత్యక్ష ఆందోళనలకు దిగింది. రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల మూసివేతపై పార్టీ నేతలు గళం విప్పారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.
అన్న క్యాంటీన్ల మూసివేతపై ఇవాళ తెదేపా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. కర్నూలులోనూ జిల్లా నేతలు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు.
అన్న క్యాంటీన్ మూసివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెదేపా నేత మాజీ మంత్రి భూమా అఖిలప్రియ నిరసన వ్యక్తం చేశారు. కార్యకర్తలతో కలిసి ఆళ్లగడ్డలో ర్యాలీ నిర్వహించారు. తానే స్వయంగా భోజనం తెప్పించి ప్రజలకు అందించారు. చంద్రబాబు మీద కోపంతో అన్న కాంటీన్ల మూసివేత తగదన్నారు. ప్రతిరోజు రెండు లక్షల మంది ప్రజల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ మూసివేయడం దారుణమన్నారు. కర్నూలులోని కల్లూరు ఎస్టేట్‌లో ఉన్న అన్న క్యాంటీన్ ముందు పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షలు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఖాళీ ప్లేట్‌లతో నిరసన తెలిపి అన్న క్యాంటీన్లను తెరవాలన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని గౌరుచరితారెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలోనూ తెదేపా నాయకులు ధర్నా చేశారు. స్థానిక శ్రీనివాస సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి భూమా బ్రహ్మానందరెడ్డి పూలమాల వేసి.. అనంతరం కార్యకర్తలతో అన్న క్యాంటిన్ వద్ద ధర్నా చేశారు. ఆదోనిలో తెదేపా నాయకులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అన్న క్యాంటీన్ను వెంటనే ప్రారంభించి... పేదల ఆకలి తీర్చాలని వైకాపా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.