ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీశైలంలో 'వేలం' వివాదం... ఆలయ ఈవోపై బదిలీ వేటు - auction

శ్రీశైలంలో దుకాణాల వేలంపాట వివాదానికి ప్రభుత్వం తాత్కాలికంగా తెరదించింది. అన్యమతస్థులకు దుకాణాలు కేటాయిస్తున్నారంటూ హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తంచేయటంతో వేలంపాట రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆలయ ఈవోను బదిలీ చేసి కొత్తవారికి బాధ్యతలు అప్పగించింది.

శ్రీశైలం

By

Published : Aug 20, 2019, 4:52 AM IST

శ్రీశైలంలోలలితాంబికా వాణిజ్య సముదాయం దుకాణాల వేలంపాటలో తలెత్తిన వివాదం ఈవో రామచంద్ర మూర్తి బదిలీకి దారితీసింది. ఈ నెల 16న రామచంద్రమూర్తి ఆధ్వర్యంలో వేలం పాట నిర్వహించగా అందులో అన్యమతస్థులు పాల్గొన్నారంటూ భాజపా నియోజకవర్గ బాధ్యుడు బుడ్డా శ్రీకాంతరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. కొందరు నాయకులు వేలం పాటకు వచ్చిన వారిపై దాడి కూడా చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు శ్రీకాంత్‌రెడ్డిని అరెస్టు చేసి వేలం పాటను తాత్కాలికంగా వాయిదా వేయించారు. ఆదివారం బాగా పొద్దుపోయాక మళ్లీ వేలం పాటకు యత్నించగా భాజపా నాయకులు మరోసారి గొడవకు దిగారు.

వేలం వివాదం మీడియాకెక్కడంతో.. కొన్ని హిందూ సంస్థలు "ఛలో శ్రీశైలం" కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. శ్రీశైలం ఈవో శ్రీరామచంద్రమూర్తి అన్యమతస్థులను ప్రోత్సహిస్తూ ఆలయ ప్రతిష్ఠ దిగజార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాయి. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కొన్ని ఫిర్యాదులూ అందాయి. హిందూ సంస్థల ఛలో శ్రీశైలం కార్యక్రమంతో వివాదం మరింత ముదిరేలా ఉందని గుర్తించిన ప్రభుత్వం ఈవో రామచంద్రమూర్తిపై బదిలీ వేటు వేసింది. కొత్త ఈవోగా రంపచోడవరం స్పెషల్ డిప్యూటి కలెక్టర్ కేఎస్ రామారావును నియమిచింది. దేవాలయాల్లో రాజకీయాలకు తావులేదన్న మంత్రి వెల్లంపల్లి తక్షణమే వేలం పాట ప్రక్రియను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని కొత్త ఈవోను ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details