ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Sriram statue in Mantralayam: మంత్రాలయంలో అద్భుతం.. ప్రపంచంలో ఎత్తైన శ్రీరాముని పంచలోహ విగ్రహం

Sriram statue in Mantralayam: కర్నూలు జిల్లా మంత్రాలయంలో ప్రపంచంలో అత్యంత ఎత్తయిన 108 అడుగుల శ్రీరాముని పంచలోహ విగ్రహాన్ని నిర్మించేందుకు నేడు శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రెండేళ్లలో అందుబాటులోకి తీసుకురానున్న ఈ ఆలయాన్ని రూ.300 కోట్లతో నిర్మించనున్నారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Jul 23, 2023, 9:47 AM IST

Sriram statue in Mantralayam: ప్రపంచంలో అత్యంత ఎత్తయిన 108 అడుగుల శ్రీరాముని పంచలోహ విగ్రహాన్ని, దానికి అనుబంధంగా రామాలయాన్ని కర్నూలు జిల్లా మంత్రాలయంలో రూ.300 కోట్లతో నిర్మించనున్నారు. జైశ్రీరామ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ నిర్మాణం జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వర్చువల్‌ పద్ధతిలో ఆదివారం శంకుస్థాపన చేయనున్నారు. గుజరాత్‌లో సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ భారీ విగ్రహాన్ని రూపొందించిన శిల్పి రామ్‌ వాంజీ సుతార్‌కు శ్రీరాముని విగ్రహ రూపకల్పన బాధ్యతలు అప్పగించారు. విగ్రహ నమూనాను ఆయన ప్రాథమికంగా ఖరారు చేశారు. ఆ నమూనా ఆధారంగా రూపొందించిన చిన్న విగ్రహంతో ఆదివారం శంకుస్థాపన చేస్తారు.

రెండేళ్లలో 108 అడుగుల పంచలోహ విగ్రహం తయారు చేసిన తర్వాత విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు. ఆ విగ్రహానికి ముందు రామాలయం నిర్మిస్తారు. మంత్రాలయం శ్రీమఠానికి సుమారు కిలోమీటరు దూరంలో పదెకరాల సువిశాల స్థలంలో ఆలయ నిర్మాణం జరగనుంది. పూర్తిస్థాయి రాతి కట్టడంలా ఈ రామాలయాన్ని తీర్చిదిద్దనున్నారు. ఆలయ ఆకృతుల రూపకర్తల్లో ప్రముఖుడైన డాక్టర్‌ ఎ.వేలుకు ఈ ఆలయ నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. ఈ పదెకరాల్లోనే తిరుమల వెంకటేశ్వరస్వామి, కాశీలోని విశ్వనాథ ఆలయం, సింహాచలంలోని నరసింహస్వామి దేవాలయం, ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌ ఆలయం, కేరళ అనంత పద్మనాభస్వామి దేవాలయం, బాసర జ్ఞాన సరస్వతి ఆలయం, కర్ణాటక చెలువ నారాయణస్వామి ఆలయం, తమిళనాడు మూషణం వరాహస్వామి ఆలయం, మహారాష్ట్రలోని విఠోభా రుక్మిణి ఆలయాలను తలపించే చిన్నపాటి ఆలయాలనూ నిర్మిస్తారు.

రాఘవేంద్రస్వామికీ శ్రీరాముడే ఆరాధ్య దేవుడు..
కోట్ల మంది ఆరాధించే రాఘవేంద్రస్వామికి శ్రీరాముడు ఆరాధ్య దైవం. దీన్ని దృష్టిలో ఉంచుకునే మంత్రాలయంలోని శ్రీరాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు శ్రీరాముని విగ్రహ ఏర్పాటుకు అవసరమైన పదెకరాల స్థలాన్ని కేటాయించారు. మంత్రాలయానికి మరో మణిహారంలా ఉండేలా.. ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా పంచలోహాలతో 108 అడుగుల శ్రీరాముని విగ్రహాన్ని ఏర్పాటుచేస్తున్నామని 'జై శ్రీరామ్‌ ఫౌండేషన్‌' వ్యవస్థాపకులు రాము తెలిపారు.

భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటిగా కర్నూలు జిల్లాలోని మంత్రాలయం- శ్రీ రాఘవేంద్రస్వామివారి మఠం వెలుగొందుతోంది. రాఘవేంద్రస్వామి జీవసమాధిలోకి ప్రవేశించిన బృందావనాన్ని దర్శించుకునేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి నిత్యం 10వేలమందికి పైగా భక్తులు.. పర్యాటకులు వస్తుంటారు.

స్థల పురాణం..
మంత్రాలయం ఒకప్పుడు మారుమూల ప్రాంతం. దీన్ని మంచాల గ్రామంగా పిలిచేవారు. ఈ ప్రాంతం ఆదోని నవాబు పాలనలో ఉండేది. మధ్వమఠంలో సన్యాసం స్వీకరించిన రాఘవేంద్రస్వామి అక్కడున్న మూల రాములను పూజిస్తూ, బోధనలు చేస్తూ మంత్రాలయానికి వచ్చారు. స్వామి పూర్వ అవతారం శ్రీమహావిష్ణువు భక్తపారాయణుల్లో ఒకడైన ప్రహ్లాదుడు. అప్పుడు యజ్ఞాలు, యాగాలు చేసిన స్థలం మంత్రాలయమని గాథ. అందుకే పూర్వవతారంలో రాజుగా పాలించిన స్థలం కావడంతో ఇక్కడే తాను బృందావనస్థులు (జీవ సమాధి) కావాలని స్వామి తలచారు. ఆ సమయంలోనే ఆ గ్రామదేవత మంచాలమ్మ (రేణుకాంబ రూపిణి) రాఘవేంద్రస్వామిని ఇక్కడే ఉంచాలని ఆజ్ఞాపించిందట! దీంతో స్వామి ఇక్కడే ఉంటూ చివరకు ఇక్కడే బృందావనస్థులు అయ్యారు. అప్పటి నుంచి నిత్యం రాఘవేంద్రస్వామి మూల బృందావననానికి పండితులు మంత్రాలు వల్లిస్తూ ఉండటంతో ఈ మఠం కాలక్రమంలో మంత్రాలయంగా మారిందని చెబుతారు. ఇక్కడికొచ్చే భక్తులు ముందుగా గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని.. అనంతరం రాఘవేంద్రస్వామి బృందావనాన్ని దర్శించుకొంటారు.

ABOUT THE AUTHOR

...view details