కర్నూలు జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. శ్రీశైలం, నంద్యాలల్లోనూ వానతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వర్షంతో శ్రీశైల మహాక్షేత్రంలో ప్రకృతి రమణీయత సంతరించుకుంది. భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం చుట్టూ ఉన్న నల్లమల కొండలు వర్షపు జల్లుల వల్ల పచ్చదనంతో ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి. నల్లమల కొండలన్నీ హిమగిరులను తలపిస్తున్నాయి. శ్రీగిరి క్షేత్రం ఒకవైపు వర్షపు జల్లులు, మరోవైపు ఆలయ వేద మంత్రోచ్ఛరణలతో ఆధ్యాత్మికత శోభతో ఉట్టిపడుతోంది. చిరుజల్లుల్లో తడుస్తూ భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
నంద్యాలలో దాదాపు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పట్టణంలోని పలు రహదారులు నీటితో నిండిపోయాయి. మురుగు నీటి కాలువల నిర్వహణ సక్రమంగా లేక సంజీవనగర్ గేట్ నుంచి పురపాలక సంఘం కార్యాలయం ముందు వరకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది.