attack on labours: కర్నూలు జిల్లా రైల్వేస్టేషన్‌లో పైవంతెన పనులు చేస్తున్న కూలీలు, పర్యవేక్షిస్తున్న సిబ్బందిపై కొందరు రాళ్లదాడికి పాల్పడటంతో పాటు వాహనాలు ధ్వంసం చేయడం కలకలం రేపింది. కాంట్రాక్టులో కమీషన్ ఇవ్వలేదన్న అక్కసుతో ఓ ప్రజాప్రతినిధి అనుచరులు ఈ దారుణానికి తెగబడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కర్నూలు జిల్లా మద్దికెరలో గురువారం జరిగిన ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మద్దికెర నుంచి బేతంచర్ల వరకు ఆరు రైల్వేస్టేషన్లలో ప్రయాణికులు పట్టాలు దాటేందుకు పైవంతెనలు నిర్మిస్తున్నారు. బెంగళూరుకు చెందిన వీవీఆర్‌కే అసోసియేట్స్ సంస్థ రూ.20 కోట్లకు ఈ కాంట్రాక్టు దక్కించుకుంది. మద్దికెర స్టేషన్‌లో పనులు చేస్తున్న గుత్తేదారు సిబ్బంది నుంచి రూ.25 లక్షలు ఇవ్వాలని ఓ ప్రజాప్రతినిధి అనుచరులు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది.
వీడియో రికార్డింగ్‌తో గుట్టు బయటకు!
పనులు జరుగుతున్న ప్రదేశానికి వచ్చిన పది మంది దుండగులు ఒక్కసారిగా కూలీలు, సిబ్బందిపై రాళ్లతో విరుచుకుపడ్డారు. ఇంజినీర్ నందకుమార్, సూపర్‌వైజర్ కృష్ణయ్యలకు గాయాలయ్యాయి. తమిళనాడుకు చెందిన కూలీలు తలోదిక్కున పారిపోయారు. అక్కడే ఉన్న కారును, సిమెంటు మిశ్రమం కలిపే లారీని తీసుకెళ్లి కిలోమీటరు దూరంలో రోడ్డు పక్కన వదిలేశారు. పొక్లెయిన్ తాళాలు లాక్కొనేందుకు యత్నించగా.. స్థానికుడైన వాహన యజమాని బతిమాలడంతో వదిలేశారు.