park was occupied in Kurnool: కర్నూలు పట్టణ పరిధిలోని 19వ వార్డు నగరపాలక సంస్థకు చెందిన పార్కు స్థలాలు అన్యాక్రాంత మవుతున్నాయని మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి అన్నారు. జొహరాపురం నజర్ కాలనీలో పార్కు స్థలాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఆక్రమించారని స్థానికులు మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డికి విన్నవించారు. ఈ నేపథ్యంలో ఆమె స్థలాన్ని పరిశీలించారు. 42 ఏళ్ళ కిందట పార్కు కోసం కేటాయించిన స్థలాన్ని కొందరు అక్రమించారని అన్నారు. స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వైసీపీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఇక్కడ పార్క్ ఉందని ఇళ్లు, అపార్ట్మెంట్లను ఎక్కువ ధరకు కొనుగోలు చేశామని ఇప్పుడు పార్క్ లేకుంటే ఎలా అని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్ నిధులతో పార్క్ చుట్టూ కంచే వేసి దిమ్మలు వేయించారని వాటిని కబ్జాదారులు తొలగించినా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని స్థానికులు ప్రశ్నించారు. ప్లాట్లు వేసిన వారిని ప్రశ్నిస్తే పార్క్నే అక్రమించిన వాళ్లం.. మీ ఇళ్లను ఆక్రమించలేమా అని భయపెడుతున్నారని స్థానిక మహిళలు తెలిపారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి పార్క్ స్థలాన్ని కాపాడాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేవడతామని గౌరు చరితా రెడ్డి తెలిపారు.