ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ గోపాలుడు.. సరస్వతీ పుత్రుడు - studies

ఆయన వయసు 63... అయితేనేం పుస్తకం పడితే పూర్తయ్యేవరకూ వదిలిపెట్టరు. చదువులోని మాధుర్యాన్ని పసిగట్టేశారేమో... ఇప్పటికే 13 డిగ్రీలు పూర్తి చేశారు. అంతటితో ఆగకుండా ఆ కుటుంబాన్ని సరస్వతీ నిలయంగా మార్చారు. మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకుంటూ కాలక్షేపం చేయాల్సిన వయసులో పుస్తకాలతో సహజీవనం చేస్తున్నారు.

గోపాల్

By

Published : May 27, 2019, 7:11 AM IST

గోపాల్ కేరాఫ్ డిగ్రీస్

డిగ్రీ వరకూ చదవాలంటేనే చాలా మందికి ఎంతో కష్టం. ఉద్యోగం వచ్చిందా చదువును అటకెక్కించేవారు ఇంకెందరో. ఓ పెద్దాయన మాత్రం డిగ్రీలు, పీజీలు చేసేస్తూ నిత్య విద్యార్థిగా మారిపోయారు. ఆయనతోపాటు కుటుంబ సభ్యులకూ ప్రేరణ కలిగించి ఉన్నత చదువులు చదివిస్తూ.. ఇంటినే సరస్వతీ నిలయంగా మార్చేశారు.

63 ఏళ్ల వయసులోనూ..

కర్నూలు నగరంలోని నరసింహారెడ్డి నగర్​కు చెందిన గోపాల్ 63 ఏళ్ల వయసులోనూ చదువుకుంటూ నిత్యవిద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు. బ్యాంకింగ్ మేనేజ్​మెంట్​లో పీహెచ్​డీ సహా ఇప్పటివరకూ 5 మాస్టర్ డిగ్రీలు, 5 పీజీ డిప్లొమోలు, 2 డిప్లొమోలు, ఒక అకౌంట్ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేశారు. ఇప్పటికీ చదువుతూనే ఉన్నారు. భవిష్యత్తులో మరిన్ని డిగ్రీలు సాధిస్తానని 'పుస్తకం' సాక్షిగా చెప్తున్నారు.

ఇస్లామిక్ బ్యాంకింగ్​లోనూ...

తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లోనే కాదు ఇస్లామిక్ బ్యాంకింగ్​లోనూ డిగ్రీ పట్టా పొందారు. బెహ్రెయిన్​లో సర్టిఫైడ్ షరియా అడ్వైజర్ అండ్ ఆడిటర్ కోర్సు పూర్తి చేశారు. ప్రస్తుతం 'సర్టిఫైడ్ ఇస్లామిక్ ప్రొఫెషనల్ అకౌంటెంట్' కోర్సు చదువుతున్నారు. ఈ కోర్సులు చేయటం తేలికైన విషయం కాదు. ఈ 2 కోర్సులు చేసినవారు ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటారు. అంతేకాదు ఆఫ్రికా దేశాల్లోనూ చదువుకున్నారు. మొదట బ్యాంక్ ఉద్యోగిగా.. ఆ తర్వాత ఆడిటర్ వద్ద.. అనంతరం అధ్యాపకుడిగా పనిచేశారు. ప్రస్తుతం న్యాయ విద్యార్థులకు న్యాయశాస్త్రం బోధిస్తున్నారు.

ఆ ఇల్లే... ఓ గ్రంథాలయం

గోపాల్ ఇల్లు పెద్ద గ్రంథాలయాన్ని తలపిస్తుంది. ఎక్కడ చూసినా... పుస్తకాలు, సర్టిఫికెట్లు, ఫొటోలు కనిపిస్తాయి. భర్త ప్రోత్సాహంతో భార్య సురేఖ సైతం ఉన్నత చదువులు చదువుకున్నారు. ఎకనామిక్స్​లో పీహెచ్​డీ సహా 4మాస్టర్ డిగ్రీలు పూర్తి చేశారు. 25 ఏళ్లుగా అధ్యాపక వృత్తిలో రాణిస్తున్నారు. కుమారుడు హరికృష్ణ చైతన్య ఎంబీఏ పూర్తి చేశారు. ప్రస్తుతం పీహెచ్​డీ చేస్తున్నారు. కుమార్తె హరిత... మూడు మాస్టర్ డిగ్రీలు చేశారు. ఆర్కిటెక్​గా పనిచేస్తూ.. పీహెచ్​డీ చేస్తున్నారు.

ఇష్టపడి చదివితే ఎంత కష్టమైన చదవునైనా పూర్తి చేయవచ్చని నిరూపిస్తున్నారు గోపాల్ కుటుంబం. ఎంత చదివినా విద్య తరగదని... అందులోనే ఆనందం ఉందని చాటి చెబుతున్నారు.

ఇవీ చదవండి..అన్నవరం స్వామివారి సన్నిధిలో వేలాది జంటల వ్రతాలు

ABOUT THE AUTHOR

...view details