Muslims protest against Dulhan Scheme Dropped: పేద ముస్లిం యువతుల పెళ్లికి ఆర్థిక సాయం అందించే దుల్హన్ పథకానికి నిధులు లేవని హైకోర్టుకు ప్రభుత్వం విన్నవించడం దారుణమని మైనార్టీ నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళనలు నిర్వహించారు. నంద్యాల జిల్లా గడివేముల మండల తహశీల్దారు కార్యాలయం ఎదుట తెలుగుదేశం మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో ముస్లింలు ధర్నా చేశారు. దుల్హన్‌ను కొనసాగించాలంటూ తహసీల్దారుకు వినతిపత్రం ఇచ్చారు.
మైనారిటీలను సీఎం జగన్ మోసగించారంటూ కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం హుసేనాపురంలో ముస్లింలు నిరసన తెలిపారు. షాదిఖానా వద్ద జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫాలకు వైకాపా మంగళం పాడిందని ఆక్షేపించారు. మైనార్టీల అభివృద్ధిని కాంక్షించి చంద్రబాబు పెట్టిన విదేశీ విద్య పథకాన్ని దుర్వినియోగం చేశారని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి నజీర్ అహ్మద్ మండిపడ్డారు. ఇచ్చిన హామీలను జగన్ నిలబెట్టుకోవాలని.. ముస్లింలకు ఆపేసిన పథకాలను తిరిగి ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం మైనార్టీల హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తోందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలి మండిపడ్డారు. మైనార్టీలకు 5శాతం రిజర్వేషన్లను అడ్డుకున్న ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ ఇచ్చి జగన్ ముస్లింను మోసం చేశారని ఆక్షేపించారు.