కొత్త ప్రభుత్వం...కొత్త జట్టు పూర్తి స్థాయిలో సిద్ధమైపోయింది. కర్నూలు జిల్లా నుంచి డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంత్రిగా ప్రమాణం చేశారు. ఆయనతో పాటు జిల్లా నుంచి ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కూడా మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.వీరితో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించారు.
సర్పంచి టూ మంత్రి..
మంత్రులుగా ఇరువురు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం వైకాపాలో అగ్రనేతగా, వివాదరహితుడిగా పేరున్న డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి మంత్రి పదవి దక్కింది. ఇంజినీరింగ్ లో డిగ్రీ పొందిన బుగ్గన...1996లో సర్పంచిగా ఎన్నికయ్యారు. పదేళ్లు సర్పించిగా పనిచేసిన ఆయన...2008లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఆ తర్వాత జగన్ కలిసి నడిచిన ఆయన...2014లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కీలకమైన పీఏసీ ఛైర్మన్ బాధ్యతలు చేపట్టి అందరి మన్ననలు పొందారు. 2019 ఎన్నికల్లోనూ తెదేపా అభ్యర్థి కేఈ ప్రతాప్ పై 35,516 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
సామాజిక బలం అండగా... మంత్రులుగా ఇరువురు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం జిల్లా నుంచి రెండో మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన జయరాం వరసగా రెండోసారి ఆలూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వాల్మీకి ఓటర్లు ఎక్కువగా ఉన్న కర్నూలు, అనంతపురం జిల్లాల్లో జయరాం ఒక్కరే ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతోపాటు బళ్లారి నేతల నుంచి బలమైన అండ ఉండటంతో అనూహ్యంగా మంత్రివర్గం జట్టులోకి జయరాం పేరు వచ్చింది. సామాజిక సమీకరణాలతో జగన్ జట్టులోకి అవకాశం దక్కించుకున్నారు. తెలుగుదేశం పార్టీలో సామాన్య కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించిన జయరాం... వైకాపా ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణం చేశారు.