Kurnool Mega Seed Hub: ఉమ్మడి కర్నూలు జిల్లా జూపాడుబంగ్లా మండలం తంగడంచ గ్రామంలో 1,600 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో.. మెగా సీడ్ హబ్, అల్ట్రా మెగా ఫుడ్ పార్కులు ఏర్పాటు చేస్తే సద్వినియోగం అవుతుందని గత ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. నేల, వాతావరణం అనుకూలంగా ఉండే.. తంగడంచ గ్రామ పరిసరాల్ని విత్తన హబ్‌గా మార్చాలని అప్పటి సీఎం చంద్రబాబు.. శంకుస్థాపన చేశారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం.. సాంకేతిక భాగస్వామ్యం, అమెరికాలోని అయోవా యూనివర్శిటీ.. సమాచార కేంద్రంగా పనిచేయటానికి ఒప్పందం చేసుకున్నారు. గోదాములు, విత్తన పరీక్షా కేంద్రాలు, పరిశోధనా కేంద్రం, సీడ్ ప్రాసెసింగ్ యూనిట్, శిక్షణా కేంద్రం, నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు ప్రణాళికలు వేశారు. అయితే ప్రభుత్వం మారాక.. విత్తన భాండాగారం మూలనపడింది. దీంతో వేలాది మంది ఉపాధి అవకాశాలు.. గల్లంతయ్యాయి. గతంలో నిర్మించిన సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది.
సీడ్ హబ్‌లో భాగంగా అంతర్జాతీయంగా పేరుగాంచిన.. జైన్ ఇరిగేషన్, గుజరాత్ అంబుజా ఎక్స్‌పోర్ట్ వంటి సంస్థలను.. పెట్టుబడులు పెట్టేందుకు గత ప్రభుత్వం ఒప్పించింది. కొన్ని కోట్ల రూపాయలతో.. మౌళిక వసతులూ కల్పించింది. నాటి సీఎం చంద్రబాబు 2017 జూన్ 21న.. జైన్ ఇరిగేషన్ సంస్థ పనులకు శంకుస్థాపన కూడా చేశారు. ఒప్పందం ప్రకారం.. జైన్ ఇరిగేషన్ సంస్థ రెండేళ్లలో కార్యకలాపాలూ ప్రారంభించింది. అయితే.. వైసీపీ ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరవవడంతో.. కార్యకలాపాలు దాదాపు ఆగిపోయాయి. మరో సంస్థ గుజరాత్ అంబుజా మొత్తానికే ముఖం చాటేసింది. ప్రభుత్వం ప్రోత్సహిస్తే రైతులకు నాణ్యమైన విత్తనాలతో పాటు.. స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. విత్తన భాండాగారం ప్రణాళికల్ని పట్టాలెక్కించాలని స్థానికులు కోరుతున్నారు.