Cluster university problems: కర్నూలు క్లస్టర్ విశ్వవిద్యాలయం కాగితాలకే పరిమితమైంది. ఉపకులపతి, రిజిస్ట్రార్‌లను నియమించినా కళాశాలలపై పర్యవేక్షణ లేకుండాపోయింది. ఉన్నత విద్యాశాఖ పట్టించుకోకపోవడంతో నిధులు, అధికారాలు లేని వర్సిటీగా మారింది. కర్నూలులోని సిల్వర్‌జూబ్లీ కళాశాల, కేవీఆర్ మహిళా డిగ్రీ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను కలిపి క్లస్టర్ విశ్వవిద్యాలయంగా ఏర్పాటు చేస్తూ 2020 జనవరి 7న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 మార్చి 2న ఉపకులపతిని నియమించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ 3 కళాశాలలు క్లస్టర్ వర్సిటీ కిందకు రావాల్సి ఉండగా.. ఇప్పటికీ రాయలసీమ విశ్వవిద్యాలయం తరఫునే ధ్రువపత్రాలను జారీ చేస్తున్నారు.
క్లస్టర్ వర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిన అనంతరం ఈ 3 కళాశాలలకు రాయలసీమ వర్సిటీ అనుబంధ గుర్తింపు రద్దవుతుంది. కళాశాలలను ఉపకులపతి పర్యవేక్షించాల్సి ఉండగా.. ఆ బాధ్యతలను ఆయనకు ఇవ్వకుండా కళాశాల విద్య కమిషనరే చూస్తున్నారు. అధ్యాపకులూ కమిషనరుకే రిపోర్టు చేస్తున్నారు. దీంతో ఉపకులపతి, రిజిస్ట్రార్ ఉన్నా కళాశాలలను పర్యవేక్షించలేని పరిస్థితి నెలకొంది. క్లస్టర్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసినా నిర్వహణకు నిధులు ఇవ్వడం లేదు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఉన్నత విద్యామండలి వద్ద రూ.25 లక్షలు అప్పు తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు వచ్చిన తర్వాత వెనక్కి చెల్లించాలనే నిబంధనలపై ఈ మొత్తాన్ని తీసుకున్నారు. ఇటీవల సీఎం జగన్ నిర్వహించిన సమావేశంలో వచ్చే సమీక్ష సమయానికి క్లస్టర్ వర్సిటీని అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఇంతవరకు కళాశాలలు ఉపకులపతి నియంత్రణలోకి రాలేదు.