ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముగ్గురు ఐఏఎస్​లకు.. జైలుశిక్ష విధించిన హైకోర్టు - హైకోర్టు వార్తలు

హైకోర్టు
హైకోర్టు

By

Published : May 6, 2022, 10:07 PM IST

Updated : May 7, 2022, 4:45 AM IST

22:04 May 06

పూనం మాలకొండయ్య, వీరపాండ్యన్‌, అరుణ్‌కు జైలుశిక్ష

కోర్టు ధిక్కరణ కేసులో ముగ్గురు ఐఏఎస్‌లకు రాష్ట్ర హైకోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది. న్యాయస్థానం శిక్ష విధించిన వారిలో వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, వ్యవసాయశాఖ పూర్వ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌, పౌర సరఫరాల సంస్థ ఎండీ జి.వీరపాండియన్‌ ఉన్నారు. వారికి నెల రోజుల సాధారణ జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. కోర్టుకు హాజరైన ఐఏఎస్‌లు అరుణ్‌కుమార్‌, వీరపాండియన్‌ అభ్యర్థన మేరకు తీర్పు అమలును ఆరు వారాలు నిలిపివేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. అయితే సకాలంలో ఐఏఎస్‌ అధికారి పూనం మాలకొండయ్య హాజరుకాకపోవడంతో తీర్పు అమలును నిలుపుదల చేయడానికి న్యాయమూర్తి నిరాకరించారు. న్యాయస్థానాలు ఎవరి కోసమూ ఎదురు చూడవని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ నెల 13లోపు హైకోర్టు రిజిస్ట్రార్‌(జ్యుడీషియల్‌) ముందు సరెండర్‌ కావాలని ఐఏఎస్‌ అధికారి పూనం మాలకొండయ్యను ఆదేశించారు. సింగిల్‌ జడ్జి తీర్పుపై పూనం మాలకొండయ్య శుక్రవారమే అత్యవసరంగా ధర్మాసనం ముందు అప్పీల్‌ చేశారు. ఆ అప్పీల్‌పై విచారించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం.. పూనం మాలకొండయ్య విషయంలో సింగిల్‌ జడ్జి తీర్పును నిలుపుదల చేసింది.

కర్నూలు జిల్లా ఎంపిక కమిటీ తనను విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌(గ్రేడ్‌-2)గా ఎంపిక చేయకపోవడాన్ని సవాలు చేస్తూ జిల్లాకు చెందిన ఎన్‌.మదన సుందర్‌ గౌడ్‌ 2019లో హైకోర్టును ఆశ్రయించారు. ఆ పోస్టుకు పిటిషనర్‌ పేరును పరిగణనలోకి తీసుకోవాలని, రెండు వారాల్లో ఈ వ్యవహారంపై తగిన ఉత్తర్వులు ఇవ్వాలని 2019 అక్టోబర్‌ 22న న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది. కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో పిటిషనర్‌ కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. ఈ వ్యాజ్యంపై లోతైన విచారణ చేసిన న్యాయమూర్తి.. ఐఏఎస్‌ పూనం మాలకొండయ్య 2019 సెప్టెంబర్‌ 27న.. హెచ్‌ అరుణ్‌కుమార్‌కు సూచనలు ఇవ్వడం తప్ప ఎలాంటి చర్యలూ తీసుకోలేదని తప్పుట్టారు. మరోవైపు కోర్టు ఆదేశాల అమలు కోసం అరుణ్‌కుమార్‌.. జి.వీరపాండియన్‌కు ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేదన్నారు. వీరపాండియన్‌ సైతం కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలయ్యాకే.. స్పీకింగ్‌ ఉత్తర్వులిచ్చారన్నారు. సరైన స్ఫూర్తితో కోర్టు ఉత్తర్వులను సకాలంలో అమలు చేయడంలో అధికారులు ముగ్గురూ నిర్లక్ష్యం చేశారని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. కోర్టు ఉత్తర్వుల అమలులో ఇబ్బంది ఎదురైతే అధికారులు సమయం పొడిగింపు కోసం న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేయవచ్చని, ప్రస్తుత కేసులో అలాంటి యత్నాలు చేయలేదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:విశ్రాంత ఐఏఎస్‌ చిన వీరభద్రుడికి జైలుశిక్ష, జరిమానా

Last Updated : May 7, 2022, 4:45 AM IST

ABOUT THE AUTHOR

...view details