Kottam Badi in Kurnool : కర్నూలులోని ఇందిరాగాంధీ నగర్, ఇల్లూరు నగర్, పీవీ నరసింహారావు నగర్ ప్రాంతాల్లో నిరుపేదలు, రోజువారీ కూలీలు జీవనం సాగిస్తున్నారు. ఈ ప్రాంత చిన్నారులకు చదువు చెప్పించాలన్న లక్ష్యంతో... 1970లో స్థానికులు ప్రభుత్వ స్థలంలో పాఠశాల ఏర్పాటు చేసుకున్నారు. రోజ్ మండ్ అనే మహిళ సేవా భావంతో ముందుకు రావటంతో... ఆమెనే ఉపాధ్యాయురాలిగా నియమించుకున్నారు. క్రమంగా ఈ పాఠశాలను ప్రభుత్వం గుర్తించి... ఎయిడెడ్ పాఠశాలగా మార్చించి. బడిలో ఉపాధ్యాయుల సంఖ్య పెరిగింది. స్థానికంగా ఉన్న చిన్నారులంతా ఇక్కడే చదువుకున్నారు. అయితే 2006లో రోజ్‌మండ్ ఈ పాఠశాలను నివాస స్థలంగా పట్టా తెప్పించుకున్నారు. దీంతో ఎయిడెడ్ పాఠశాలలకు నిధులు నిలిపివేయటంతో బడి మూతపడింది. ఇప్పుడీ స్థలంపై కొందరి కన్నుపడింది. బడి స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నిస్తుండటంతో పూర్వ విద్యార్థులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా బడి మాకు కావాలంటూ నడుం బిగించారు.
అక్రమంగా పట్టా చేయించుకున్న టీచర్.. ఎన్నో ఏళ్లుగా దీన్ని కొట్టం బడి అని పిలేచేవారు. ఇందులో వందలాది మంది చిన్నారులు విద్యను అభ్యసించారు. స్కూలు మూతపడటంతో... ఆ స్థలం తమదేనని దానికి పట్టాలు ఉన్నాయని రోజ్ మండ్ కుమార్తెలు వేరొకరికి విక్రయించారు. తాము ఇందులో బహుళ అంతస్థుల భవనాన్ని నిర్మిస్తామని కొనుగోలు చేసిన వ్యక్తులు రావటంతో స్థానికుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాన్ని ఎలా విక్రయిస్తారని కలెక్టర్, తహసీల్దార్‌కు వినతిపత్రాలు అందజేశారు.