కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం ఇటిక్యాల గ్రామ పరిధిలో సర్వే నంబరు 112/c1లో 770 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ కొండ ప్రాంతాన్ని జేసీబీలు, ప్రోక్లైనర్లతో బండ రాళ్లు తొలగించి భూమిని చదును చేశారు కొంత మంది భూ బకాసురులు. ఈ తంతు అంతా రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు జరిగేది. ఉదయాన్నే కూలీలతో గుంతలు తీసి కడప నుంచి తెప్పించిన పండ్ల, ఇతర మొక్కలు నాటించారు. ఇలా సుమారు వంద ఎకరాలకుపైగా ఆక్రమించుకునేందుకు పావులు కదిపారు. ఇక్కడ ఎకరా భూమి ఆరు నుంచి ఎనిమిది లక్షల రూపాయలు పలుకుతుంది. ఇలా చూస్తే ఆక్రమణల విలువ ఎంత లేదన్నా ఆరు కోట్ల రూపాయల పైమాటే. వారు కబ్జా చేసిన భూములకు ఇరువైపులా సిమెంటు ఫ్యాక్టరీలు ఉండటం, మరోవైపు ప్రభుత్వ ప్రాజెక్టులకు స్థల సేకరణ చేయాల్సి ఉండటంతో ఏదో ఒక లబ్ధి పొందవచ్చని ఆలోచనతో ఆక్రమణలకు తెగబడ్డారు.
కన్నేసి...మార్చేసి..కబ్జాచేసి..! - illegally occupied government lands in Kurnool district
ఓ ప్రభుత్వ భూమిపై భూ బకాసురులు కన్నేశారు. ఆలోచన వచ్చిందే తడవుగా రాత్రిళ్లు భారీ యంత్రాలతో చదును చేస్తూ పగలు మొక్కలు నాటడం ప్రారంభించారు. మున్ముందు ఎవరైనా ప్రశ్నిస్తే రెండేళ్ల నుంచి సాగులో ఉన్నట్లు చూపించుకోవడానికి దానికి తగ్గ ఎత్తులో ఉన్న మొక్కలు నాటారు. రెండు నెలల నుంచి ఆక్రమణల పర్వం జరుగుతున్నా.. ఏ ఒక్క అధికారి అటువైపు కన్నెత్తి చూడలేదు. పైగా పేదలు ఆక్రమించుకున్నారని పెద్దల జోక్యం లేదంటూ కితాబు ఇస్తుండటం గమనార్హం. ఇది కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం ఇటిక్యాల పరిధిలో చోటుచేసుకున్న భూ కబ్జా.
ఇటిక్యాలలో ప్రభుత్వ భూమి కబ్జా
ఆక్రమణలకు తెర తీసింది.... అవుకులోని ఓ గ్రామ స్థాయి నాయకుడు. ఇతనికి కొలిమిగుండ్ల, కల్వటాలకు చెందిన కొందరు సహకారం అందించినట్లు తెలుస్తోంది. అయితే అధికారులు మాత్రం 15 మంది పేదలు సాగు చేశారని... రాజకీయ పెద్దల హస్తం ఎలాంటిది లేదని వివరణ ఇచ్చారు. నిరుపేదలైతే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి యంత్రాలతో చదును చేసే అవకాశం ఉంటుందా? పెద్దల జోక్యం లేనిదే ఇంత భూ దందాకు తెగిస్తారా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదీ చదవండి:చీమకుర్తి గనులపై ప్రభుత్వం దృష్టి!