కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయం పచ్చదనంతో నిండిపోయింది. ఈ కార్యాలయంలో రెండెకరాల ఖాళీ స్థలం ఉంది. 2018 వరకు కనీసం ప్రహరీ కూడా లేదు. ఎవరూ పట్టించుకోలేదు. ఇక్కడంతా పాడుబడిన వాతావరణం కనిపించేది. 2018 జనవరిలో బదిలీపై ఫైర్ స్టేషన్ ఆఫీసర్గా మోహన్ బాబు ఇక్కడికి ఇక్కడకు వచ్చారు. అప్పటి నుంచి ఇక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
కార్యాలయాల స్థలంలో మొక్కల పెంపకం
కార్యాలయంలోని రెండెకరాల స్థలంలో మొక్కలు పెంచాలని అగ్నిమాపక అధికారి మోహన్ బాబు భావించారు. పై అధికారుల అనుమతితో.. పచ్చదనానికి శ్రీకారం చుట్టారు. కార్యాలయంలో మొత్తం 15మంది అధికారులు విధులు నిర్వహిస్తుండగా.. వారి సహకారంతో ఆకు కూరలు, కూరగాయలు, పండ్ల చెట్లు, పూల మొక్కలు వేశారు. కార్యాలయం చుట్టూ రెండు ఎకరాల స్థలాన్ని సంరక్షించుకునేందుకు గచ్చకాయల మొక్కలతో బయో ఫెన్సింగ్ వేశారు. మొక్కలన్నీ పెరిగి పెద్దయ్యాయి. సిబ్బంది కుటుంబ అవసరాలకు సరిపోయేలా.. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు పండుతున్నాయి. దీనిపై సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.