డిసెంబరు 25న ఇళ్ల స్థలాల పంపిణీ కోసం సీఎం జగన్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఆ మేరకు కర్నూలు జిల్లా ఆదోనిలోని ధనాపురం వద్ద.. లబ్ధిదారులకు స్థలాలు కేటాయించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. పట్టణ శివారుల్లో పంటపొలాల మధ్య లే అవుట్లను సిద్ధం చేశారు. ఇక్కడకు దగ్గర్లోనే గతంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టినా మధ్యలోనే వదిలేశారు. తాజాగా ఇవ్వనున్న స్థలాలను అదేవిధంగా పట్టించుకోరేమోనని లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది.
వైఎస్ పాలనలో పేదలకు పక్కా ఇళ్లను నిర్మించేందుకు.. ఇదే ధనాపురం వద్ద సెంటున్నర స్థలంలో ఇందిరమ్మ గృహాల నిర్మాణం చేపట్టారు. వాటిని లబ్ధిదారులకు కేటాయించినా.. పూర్తిస్థాయిలో నిర్మాణాలు జరగకపోవడం, మౌలిక వసతులు కల్పించకపోవడం కారణంగా అవి శిథిలావస్థకు చేరాయి. ముళ్లపొదలతో నిండిపోయి అడవిని తలపిస్తున్నాయి. ఇప్పడు ఇవ్వనున్న లే అవుట్లూ పట్టణానికి దూరంగా.. పంట పొలాల మధ్య ఉండటం వల్ల ఇవైనా అభివృద్ధికి నోచుకుంటాయా లేక మరో ఇందిరమ్మ గృహాల్లా తయారవుతాయా అని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.