కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా మార్చే ప్రక్రియను కర్నూలు జిల్లాలో తూచా తప్పకుండా అమలు పరిచారు. అన్‌లాక్ అమలవుతున్న కొద్దీ కంటైన్మెంట్ జోన్‌ల పరిధిని అర కిలోమీటర్ నుంచి వంద మీటర్లకు తగ్గించారే తప్ప ప్రక్రియను కొనసాగించడం ఆపకపోవడంతో వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చింది. బస్సుల్లో ఆరు బృందాలు తొలి నుంచే గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 2 వేల నుంచి 2,500 రక్త నమూనాలు సేకరించేలా ప్రణాళిక చేయడం వ్యాప్తి వేగాన్ని నిర్ధరించేలా చేసింది. వెయ్యి నుంచి1500 కేసులు నమోదయ్యే చోట్ల స్వీయ గృహ నిర్బంధం (హోమ్ ఐసోలేషన్) ఎత్తి వేశారు. ప్రతి ప్రాథమిక వైద్యశాల వద్ద మూడు వాహనాలు ఉంచి రోగులను సమీపంలోని కోవిడ్ కేర్ సెంటర్లకు తరలించడం వల్ల వ్యాప్తి కట్టడి చేయగలిగారు.
మాస్కు ధరించకపోతే...!
జిల్లాలో మాస్క్ ధరించకుండా ద్విచక్రవాహనాలపై తిరిగే వారికి పోలీసులు జరిమానా విధించారు. జూన్ 23 నుంచి నవబంరు 2వ తేదీ వరకు 93,240 మంది మాస్క్ ధరించని కారణంగా రూ.74,43,450 జరిమానా సమకూరింది. గతంలో మాస్క్‌లేక పోతే రూ.100 జరిమానా విధించగా, ప్రస్తుతం అది రూ.200కి చేరింది.