CBN FIRES ON CM JAGAN IN KURNOOL TOUR : కర్నూలు జిల్లాలో చంద్రబాబు మూడోరోజు పర్యనటలో స్వల్ప ఉద్రిక్తతలు తలెత్తాయి. కర్నూలు నగరంలో తెదేపా కార్యాలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. అదే సమయంలో తెదేపా కార్యాలయం వద్దకు చంద్రబాబును అడ్డుకోవడానికి కొందరు వైకాపా నాయకులు, కార్యకర్తలు వచ్చారు. న్యాయరాజధానికి అడ్డుపడుతున్న చంద్రబాబు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వారిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఉన్నా అదుపు చేయకపోవడంతో.. బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
మూడు రాజధానుల పేరుతో జగన్ దోపిడీ: ఓడిపోతారని తెలిసే జగన్ ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. పేటీఎం బ్యాచ్‌కు బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి రెచ్చగొట్టి పంపారని.. ఈ రాత్రికి ఇక్కడే ఉంటా.. మీ సంగతి చూస్తా అని హెచ్చరించారు. రాజకీయ రౌడీలను అణచివేయడం తనకు కష్టం కాదని తెలిపారు. ఆడబిడ్డల పట్ల ఇష్టానుసారం ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ధర్మాన్ని కాపాడేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాయలసీమకు అన్యాయం చేసిన జగన్.. ఓడిపోతామనే భయంతో వారి పార్టీ శ్రేణుల చేత ఆందోళన చేయిస్తున్నారని ఆక్షేపించారు. తెలుగుదేశం హయాంలో కర్నూలు జిల్లా అన్ని విధాలా అభివృద్ధిపథంలో నడిపేందుకు కృషి చేసినట్లు చంద్రబాబు వివరించారు. మూడు రాజధానుల పేరుతో జగన్ దోపిడీకి తెరతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చేతకాని దద్దమ్మ జగన్: కర్నూలు నగరంలో అడ్డుకోవడానికి వచ్చిన వైకాపా నాయకులు, కార్యకర్తలు, న్యాయవాదులు, విద్యార్థి జేఏసీ నాయకులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా నాయకుల తీరుపై, ముఖ్యమంత్రి జగన్‌పై విమర్శలు గుప్పించారు. చేతకాని దద్దమ్మ జగన్ అని దుయ్యబట్టారు. పోలీసుల తీరు వల్ల కర్నూలు ఎస్పీపై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలీసులు యూనిఫాం తీసేసి రావాలని.. పోలీసుల వల్ల కాకపోతే మేమే చూసుకుంటామని అన్నారు. ఎస్పీ ఏం చేస్తున్నారని, ఎవరికి కాపలా కాస్తున్నారని నిలదీశారు.
టిడ్కో ఇళ్లను పరిశీలించిన చంద్రబాబు: పేదల ఇళ్ల స్థలాల్లో 6 వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. 50 వేల కోట్ల విలువైన ఇళ్లను నిరుపయోగంగా చేశారని మండిపడ్డారు. కర్నూలులో 3రోజుల పర్యటనలో భాగంగా టిడ్కో ఇళ్లను పరిశీలించడానికి వెళ్తుండగా.. వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. టీడీపీ శ్రేణుల ప్రతిఘటనతో కొద్దిపాటి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తర్వాత చంద్రబాబు టిడ్కో ఇళ్లను పరిశీలించి.. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.