YS Sharmila : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్రకు మరోసారి బ్రేక్ పడింది. గతేడాది నవంబర్‌లో వరంగల్ జిల్లా చెన్నరావు పేట మండలం శంకరం తండా వద్ద శాంతి భద్రతల సమస్య కారణంగా పోలీసులు ఆమెను అరెస్టు చేయడం విదితమే. అప్పట్లో ఈ అంశంపై ఆమె కోర్టును ఆశ్రయించారు. అంతకుముందు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ లోటస్ పాండ్‌లోని తన నివాసంలో దీక్ష కూడా చేశారు. ఇదిలా ఉండగా కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం పాదయాత్రకు అనుమతించగా.. మహబూబాబాద్‌లో కొనసాగుతోంది.
మహబూబాబాద్‌లో తన పాదయాత్రను అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారని వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె చేపట్టిన పాదయాత్ర మహబూబాబాద్ నియోజకవర్గంలో 3,500కి.మీ. పూర్తి చేసుకుంది. మహబూబాబాద్ పట్టణంలో మళ్లీ అదేవిధంగా బెదిరించడం లాండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించారన్నారు. తన ఎస్కార్ట్ వాహనం, అంబులెన్స్‌పై బీఆర్ఎస్ నేతలు దాడి చేశారని మండిపడ్డారు. లోటస్ పాండ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వై.ఎస్.షర్మిల మాట్లాడారు. తనపై జరిగిన దాడి అంశంపై గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌ను కలిసి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆగడాలంటూ.. అతడికి సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ 2,100 ఎకరాలను కబ్జా చేశారని ఆరోపించారు. ఆయన చేసేదే మాఫియా, కబ్జాలు.. ఆఖరికి జర్నలిస్టులను కూడా మోసం చేశారని మండిపడ్డారు. శంకర్ నాయక్ అసభ్యపదజాలం వాడడం వల్లే తాను స్పందించాల్సి వచ్చిందని షర్మిల స్పష్టం చేశారు. పాలక పక్ష నేతలే దూషిస్తున్నారని దాడులు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో మహిళలకు గౌరవం లేదని.. మహిళలందరూ ఏకమై కేసీఆర్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు.