ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా-తెదేపా మధ్య ఓట్ల వ్యత్యాసం ఎంతో తెలుసా? - nota

ఎన్నికల్లో అఖండ విజయాన్నందుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీట్లతో పాటు భారీగా ఓట్లనూ తన ఖాతాలో వేసుకుంది. పోలైన ఓట్లలో ఏకంగా 49.95 శాతం ఓట్లు దండుకుని తెదేపాను దారుణంగా దెబ్బతీసింది. రెండు ప్రధాన పార్టీల మధ్య ఓట్ల శాతంలో పది శాతానికిపైగా వ్యత్యాసం ఉంది. జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్‌కు నోటాకంటే తక్కువ ఓట్లు రావడం విశేషం.

వ్యత్యాసం

By

Published : May 25, 2019, 7:03 AM IST

Updated : May 25, 2019, 8:06 AM IST

2014ఎన్నికల్లో దాదాపు ఒక్కశాతం ఓట్ల తేడాతో అధికారానికి దూరంగా ఉండిపోయిన వైకాపా 2019లో సత్తా చాటింది. అనూహ్యంగా 151 అసెంబ్లీ సీట్లు గెలవడమేకాదు.. ఆ మేరకు ఓట్లూ రాబట్టింది. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో.. దాదాపు 4 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 79.95 శాతం ఓటింగ్ నమోదవగా అందులో 49.95 శాతం ఓట్లు వైకాపానే దక్కించుకుంది. తెలుగుదేశానికి 39.18 శాతం ఓట్లు పడ్డాయి. ఎన్నికల సమరంలో పోట్లగిత్తల్లా తలపడిన రెండు ప్రధాన పార్టీలకు దక్కిన ఓట్ల వ్యత్యాసం 10.76 శాతం ఉంది. జనసేన, స్వతంత్రులు, గుర్తింపులేని పార్టీలు అన్నీ కలిపి కేవలం 6.79 శాతం ఓట్లకే పరిమితం అయ్యాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భాజపా, వామపక్షాలకు వచ్చిన ఓటింగ్ శాతం దారుణంగా ఉంది. రాష్ట్ర విభజన శాపం అనుభవిస్తున్న కాంగ్రెస్‌కు 1.17 శాతం ఓట్లు దక్కాయి. ఇక భాజపా జాతీయస్థాయిలో సత్తాచాటినా విభజన కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న నవ్యాంధ్రను మోసగించిందనే అపవాదతో కేవలం 0.84 శాతం ఓట్లతో సరిపెట్టుకుంది. రాష్ట్రంలో భాజపా కంటే కాంగ్రెస్​కే కాస్త ఎక్కువ ఓట్లు పడ్డాయి. సీపీఎంకు 0.32 శాతం, సీపీఐకి 0.11 శాతం ఓట్లు దక్కాయి. జాతీయ పార్టీలకంటే ఎక్కువగా నోటాకు 1.28 శాతం ఓట్లు వేయడం విశేషం.

పది శాతానికి పైగా ఆధిక్యం

2014 ఎన్నికల్లో 3.68 కోట్ల మంది ఓటు వేయగా 76.8 పోలింగ్‌ శాతం నమోదైంది. 2014లో ఒక్క శాతం ఓట్లతో అధికారాన్ని దూరం చేసుకున్న వైకాపా... ఇప్పుడు పది శాతానికి పైగా ఓటింగ్‌ ఆధిక్యంతో తెలుగుదేశాన్ని చావుదెబ్బతీసింది. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన జనసేన వైకాపా దెబ్బకు ఊసు లేకుండా పోయింది. కాంగ్రెస్‌ తరఫున పోటీలో బలమైన నాయకులు లేకపోయినా 1.17 శాతం ఓట్లు వచ్చాయంటే ఆ పార్టీకి కాస్తో కూస్తో సంప్రదాయ ఓటర్లున్నట్లే అర్థంఅవుతోంది..

Last Updated : May 25, 2019, 8:06 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details