రోగుల కడుపు నింపని....సర్వజన ఆసుపత్రి ఆహారం అనారోగ్యంతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ... భారంగా బతుకులిడుస్తున్న తమకు కనీసం సరైన తిండి తినేయోగ్యం లేదని విజయవాడ సర్వజన ఆసుపత్రి రోగులు ఆవేదన చెందుతున్నారు. రుచీపచీ లేని కూరలు, నీళ్ల సాంబారు, మజ్జిగతో కడుపునిండేదేలా అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాలు, కాంట్రాక్టర్లు మారినా ..నాణ్యమైన భోజనం మాత్రం లభించడంలేదని వాపోతున్నారు. నామమాత్రంగా వడ్డించే కూరలు తినలేక బయట కొనుక్కునే స్థోమత లేక ఇబ్బందిపడుతున్నారు. వైద్యసేవల విషయంలో శ్రద్ధ చూపుతున్న అధికారులు...రోగులకు అందించే ఆహారం విషయంలో నాణ్యత పాటించాలని కోరుతున్నారు. చాలీచాలని ఆహారం
సర్వజన ఆసుపత్రిలో రోగులకు సరఫరా చేస్తున్న భోజనం, పాలు, గుడ్లలలో నాణ్యత ప్రమాణాలు లోపిస్తున్నాయి. ఆహార విషయాన్ని ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేసినా... నాలుగైదు రోజులు హడావుడి చేస్తున్నారని...తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికే వస్తుందంటున్నారు. నాణ్యత పక్కనపెడితే.. కనీసం కడుపునిండా ఆహారం పెట్టడంలేదంటున్నారు.
పరస్పర ఆరోపణలు
ఆహారం నాణ్యత లోపించిందన్న విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాంచారయ్య స్పందించారు. ఆహార పదార్థాల నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని.. ఆహారం సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్ను హెచ్చరించారు. రోగుల ఆరోపణలో వాస్తవం లేదని.. అధికారుల పరిశీలన అనంతరమే ఆహారం అందిస్తామని సూపర్ వైజర్ సమర్థించుకుంటున్నారు.
అధికారుల పర్యవేక్షణ అవసరం
జిల్లా వ్యాప్తంగా మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నప్పటికీ... ప్రభుత్వ ఆసుపత్రులో నాణ్యమైన ఆహారం సరఫరాచేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటికైనా అధికారుల పర్యవేక్షణలో ఆహారపదార్థాలు అందించాలని పలువురు కోరుతున్నారు.
ఇదీ చదవండి :
సమావేశాలకు తోట డుమ్మా..నేతలతో చంద్రబాబు సమాలోచనలు