Venkaiah naidu: ‘ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లుతున్న భారతదేశ స్ఫూర్తి ప్రపంచానికే ఆదర్శం. కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుంటే.. మరికొన్ని వర్ధమాన దేశాలు మన అభివృద్ధిని చూసి ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నాయి. ఈ కుయుక్తులను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపైనా ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. కృష్ణా జిల్లా ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్టులో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ‘జాతీయ కవి చక్రవర్తి దామరాజు పుండరీకాక్షుడు’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయోద్యమంలో సాహితీవేత్తల పాత్ర ఎనలేనిదన్నారు. అటువంటి వ్యక్తుల్లో ఒకరైన దామరాజు జీవితం, సాహిత్యంపై పరిశోధన జరిపి తీసుకువచ్చిన ఈ పుస్తకాన్ని అందరూ చదవాలని కోరారు.గాంధీ లేనిదే సాగదు నా కాలం అంటూ నినదించిన దామరాజు స్ఫూర్తి ఆదర్శనీయమన్నారు.
సొంత కాళ్లపై నిలబడాలి:యువత డిమాండ్ ఉన్న కోర్సులపై దృష్టి సారించి పైకి ఎదగాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరారు. గ్రామీణ యువత, మహిళలు, రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు స్వర్ణభారత్ ట్రస్టు, ముప్పవరపు ఫౌండేషన్ చేస్తున్న కృషిని కొనియాడారు.గ్రాఫిక్స్, డిజైనింగ్ కోర్సు ఏర్పాటుకు రూ. 25 లక్షలు విరాళం ఇచ్చిన డాక్టర్ చదలవాడ సుధ, నాగేశ్వరరావు దంపతులు, రూ.10 లక్షలు ఇచ్చిన రామినేని ఫౌండేషన్ ఛైర్మన్, ధర్మప్రచారక్‌లను వెంకయ్య నాయుడు సన్మానించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు, పుస్తక రచయిత యల్లాప్రగడ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.