కూరగాయల ధరలు అమాంతం పెరిగి కొండ ఎక్కాయి. వారం రోజుల వ్యవధిలో దాదాపు రెట్టింపు అయ్యాయి. ఐదారు రకాలు తప్ప... మిగతావి కిలో 40 రూపాయలు పైనే పలుకుతున్నాయి. విజయవాడ రైతు మార్కెట్‌లో క్యాప్సికం, పచ్చిమిర్చి, బెండ, బీర, కాకర, క్యాబేజి వంటి కూరలు 35 రూపాయలు పైనే ధర పలుకుతున్నాయి. చిక్కుళ్లు, బీన్స్ ధర 50 రూపాయలకు పైగా చేరింది. పెరిగిన రేట్లతో ఇబ్బందులు పడుతున్నామని వినియోగదారులు అంటున్నారు. వారానికి సరిపడా కొందామని వస్తే సగం సంచి కూడా కూరలు నిండటం లేదని వాపోతున్నారు.
కొండెక్కిన కూరగాయల ధరలు... సామాన్యుల జేబుకు చిల్లు
తీవ్ర వర్షాభావ పరిస్థితులు... పెరిగిన డీజిల్ ధరలు వెరసి నిత్యావసరాలైన కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. 15 రోజులుగా పెరిగిన కూరగాయల ధరలు సామాన్యుడికి పెను భారంగా మారాయి. ఆకుకూరల ధరలు సైతం కొనే పరిస్థితి కూడా లేకపోవడం..మిర్చి, కొత్తిమీర ధరలు కంటతడిపెట్టిస్తున్నాయని కొనుగోలుదారులు వాపోతున్నారు.
కూరగాయలు
కూరగాయల ధరలు ఆకాశాన్నంటడానికి వర్షాభావ పరిస్థితులు, డీజిల్ రేట్ల పెంపు ఓ కారణమవుతున్నాయి. దీనితో పాటు రాష్ట్రంలో కూరగాయల పంటలు వేసే రైతులు నెమ్మదిగా తగ్గుతున్నారని రైతు బజార్ అధికారులు చెబుతున్నారు. దీనివల్ల ఆకుకూరలు మొదలు క్యారెట్, బీన్స్, క్యాప్సికం, మిర్చి, మెంతి కూరలను ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని అంటున్నారు. మొత్తం మీద పెరుగుతూపోతున్న కూరగాయల ధరలు సామాన్యుడికి పెను భారంగా మారుతున్నాయి.