ద్విచక్రవాహనదారులకు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు కాపాడుకునేందుకు హెల్మెట్ ఉపయోగపడుతుంది. శిరస్త్రాణాలు ధరించాలని పోలీసులు పదేపదే చెప్తున్నా కొందరు పెడచెవిన పెడుతున్నారు. పర్యవసానంగా ప్రాణాలు కోల్పోతున్నారు. హెల్మెట్ ధరించడం వలన ప్రాణాలు దక్కించుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి. అయితే శిరస్త్రాణం ధరించినా.. అవి సరిగ్గా లేకపోవటంతో మృతిచెందిన కేసులూ ఉన్నాయి.
ఐసీఐసీఐ లాంబార్డ్ అనే సంస్థ దేశవ్యాప్తంగా 18 నగరాల్లో నిర్వహించిన సర్వేలో హెల్మెట్ వినియోగంలో విజయవాడ ఆఖరిస్థానంలో ఉంది. హైదరాబాద్ 14వ స్థానంలో ఉండగా.. దిల్లీ, ముంబయి, బెంగళూరు వరుసగా 1,2,4 స్థానాలను దక్కించుకున్నాయి.
రోడ్డుప్రమాదాల్లో మరణాలను తగ్గించాలంటే శిరస్త్రాణం తప్పనిసరి. అయితే అవి కూడా నాణ్యమైనవిగా ఉండాలని అధికారులు చెప్తున్నారు. దీనిపై కేంద్రప్రభుత్వం తాజాగా గైడ్ లైన్స్ జారీచేసింది. వాహనదారులు కచ్చితంగా 'బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్' నిబంధనలు పాటించి తయారుచేసిన హెల్మెట్లనే వాడాలని సూచించింది.