వైద్య కళాశాలకు రాఘవాచారి భౌతిక కాయం అప్పగింత - విజయవాడ
పాత్రికేయ రంగంలో విశేష కృషి చేసిన విశాలాంధ్ర సంపాదకులు రాఘవాచారి సోమవారం తుది శ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని విజయవాడ, గన్నవరంలో ప్రజల సందర్శనకు ఉంచారు. అనంతరం పిన్నమనేని సిద్ధార్ధ వైద్యశాలకు అప్పగించారు.
పాత్రికేయ రంగానికి మార్గదర్శకంగా నిలిచిన విశాలాంధ్ర సంపాదకులు రాఘవాచారి మరణం తెలుగు రాష్ట్రాలకు తీరనిలోటని పలువురు ప్రముఖులు నివాళి అర్పించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాసను విడిచారు. సీపీఐ కార్యాలయంలో కొద్దిసేపు ఆయన భౌతికకాయాన్ని ఉంచారు. అనంతరం విజయవాడలోని విశాలాంధ్ర కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం రాఘవాచారి పార్ధివ దేహాన్ని తీసుకొచ్చారు. ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాఘవాచారి విలువలతో కూడిన పాత్రికేయుడిగా పనిచేశారని ప్రశంసించారు. తెదేపా నేతలు దేవినేని ఉమ, అవినాష్, కనకమేడల రవీంద్రనాథ్, వైకాపా ఎమ్మెల్యే మల్లాది విష్ణు, గౌతం రెడ్డిలు రాఘవాచారి భౌతికకాయానికి నివాళులర్పించారు.అనంతరం పార్థివ దేహాన్ని గన్నవరం మండలం చిన అవుటపల్లిలోని పిన్నమనేని సిద్ధార్థ వైద్యశాలకు కుటుంబ సభ్యులు అప్పగించారు. విజయవాడ నుంచి అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకువచ్చారు.