Rahul Padayatra in Telangana: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర రేపు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించనుంది. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణా సరిహద్దు వద్దకు 23 ఉదయం రాహుల్ పాదయాత్ర చేరుకుంటుంది. కర్ణాటక నుంచి తెలంగాణలోకి అడుగుపెట్టనున్న రాహుల్‌కి ఘనస్వాగతం పలికేందుకు కాంగ్రెస్ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. తొలిరోజు మక్తల్, నారాయణపేట, దేవరకద్ర సహా అలంపూర్, గద్వాల, కొల్లాపూర్ నియోజకవర్గాల నుంచి 50వేల మందిని సమీకరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కర్ణాటక నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించే రాహుల్ యాత్ర మొదటిరోజు కృష్ణా మండలం టైరోడ్ వరకూ సాగనుంది.
5 నియోజకవర్గాల్లో యాత్ర: దీపావళి సందర్భంగా 24, 25, 26న యాత్రకు విరామం ఇవ్వనున్నారు. మళ్లీ 27 వ తేదీ నుంచి మక్తల్, నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్‌నగర్, జడ్చర్ల నియోజకవర్గాల మీదుగా 30 వరకు యాత్ర సాగనుంది. నారాయణపేట జిల్లా కృష్ణా సరిహద్దు నుంచి మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ సమీపంలోని బూర్గులచౌరస్తా వరకు 110 కిలోమీటర్లు రాహుల్ పాదయాత్ర చేయనున్నారు. ఉమ్మడిజిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలకుగాను 5 నియోజకవర్గాల్లో యాత్ర సాగుతుండటంతో మిగిలిన నాయకులు, కార్యకర్తలు విడతలవారీగా పాదయాత్రలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. ఉదయం జరిగే పాదయాత్రలో 5 నుంచి 10వేల మంది, సాయంత్రం జరిగే యాత్రలో 20 నుంచి 30వేల మంది పాల్గొనేలా ప్రణాళిక సిద్దం చేశారు.