ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాల నిర్వహణకు.. వేదిక ఖరారైంది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ ఆదేశించారు. కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేశ్‌తో సీఎస్ వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఏర్పాట్లపై సమీక్షించారు. ఆగస్టు 15వ తేదీ ఉదయం 9 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని, అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారని, పోలీసుల కవాతు ముగిశాక.. ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు.
వేడుకలో భాగంగా.. రాష్ట్ర అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై శకటాల ప్రదర్శన ఉంటుందని వివరించారు. వేడుకలకు ముందు రోజు నుంచి విజయవాడలోని ప్రభుత్వ కార్యాలయాలను.. విద్యుత్ దీపాలతో అలకంరించాల్సిందిగా సూచించారు. నగరంలోని ప్రధాన రహదారులలో పూల మొక్కలతో తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. వర్షాకాలంను దృష్టిలో ఉంచుకుని వర్షం కురిసినా కూడా ఏటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు.