ఆలోచన ఉంటే సంపాదించటం తేలికని నిరూపిస్తున్నారు విజయవాడకు చెందిన నలుగురు గృహిణులు. య్యూటూబ్ ఛానల్స్ నిర్వహిస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు. చిన్న చిన్న సలహాలు, చిట్కాలు అందిస్తూ యూట్యూబర్స్‌గా రాణిస్తున్నారు.
అందానికి చిట్కాలు
స్వాతి.. ఓ సాధారణ గృహిణి. పెళ్లికి ముందు హైదరాబాద్‌లో ఉద్యోగం చేసి.. వివాహం తర్వాత ఇంటికే పరిమితమయ్యారు. 2017లో స్టయిల్ విత్ ఫ్యాషన్ పేరుతో హిందీలో యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించారు. మారుతున్న జీవనశైలి.. అందానికి తీసుకోవాల్సిన చిట్కాలను దృశ్య రూపంలో చిత్రీకరించి వీడియోలను యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. ఏడాది కాలంలోనే అనూహ్యమైన స్పందన లభించింది. రెండున్నర లక్షల మంది స్వాతి నిర్వహించే ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకున్నారు. ఈ ఉత్సాహంతో తెలుగులో మరో ఛానల్‌ను ప్రారంభించారు .
కొత్త రకం వంటలు నేర్పుతూ
విజయవాడకు చెందిన మరో గృహిణి స్వప్న... యూట్యూబ్ ఛానల్ ద్వారా కొత్తరకం వంటలను ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది. బీఎస్సీ చేసిన స్వప్న తనకున్న కంప్యూటర్ నాలెడ్జ్‌తో విహహం అనంతరం... స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించి తనకు ఇష్టమైన అంశాలపై వీడియోలను చిత్రీకరించి అప్లోడ్ చేశారు. అనంతరం కొత్త రకం వంటలను నేర్పుతూ.. అందరకీ మంచి రుచిని అందించేందుకు స్వప్న కిచెన్ పేరుతో మరో ఛానల్‌ను ప్రారంభించారు. ఇప్పుడు ఇంట్లోనే ఉండి నెలకు 30 నుంచి 40 వేల రూపాయల వరకు ఆర్జిస్తున్నారు .