హైదరాబాద్‌లో కరోనా కేసు నమోదు కావటంతో నగరం ఉలిక్కి పడింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమై... వైరస్ నియంత్రణకు అన్ని చర్యలు చేపడుతోంది. కరోనా సోకినట్లు నిర్ధారణ అయిన యువకుడు సికింద్రాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా వైద్యులు గుర్తించారు. దుబాయి నుంచి బెంగళూరు మీదుగా హైదరాబాద్ చేరుకున్న ఆ యువకుడు ఆదివారం గాంధీ ఆసుపత్రిలో చేరగా, వెంటనే పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో కరోనా వైరస్ ఉన్నట్లు తేలటంతో మరోసారి నిర్ధారణ కోసం పుణెలోని వైరాలజీ ప్రయోగశాలకు పంపించారు. అక్కడ కూడా ‘కొవిడ్ 19’గా సోమవారం నిర్ధారించడంతో.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని అత్యవసరంగా నిర్వహించారు.
పది రోజులుగా వైరస్.. 80 మందితో సన్నిహితం..
10 రోజులుగా ఈ యువకుడిలో వైరస్ లక్షణాలున్నట్లు గుర్తించారు. దుబాయి నుంచి హైదరాబాద్‌కు చేరుకొని గాంధీలో వైరస్ నిర్ధారించే వరకు సుమారు 80 మంది ఈ యువకుడితో సన్నిహితంగా ఉన్నట్లుగా వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేసి, యుద్ధప్రాతిపదికన ఆ 80 మంది సమాచారాన్ని సేకరించింది. అందరికీ కరోనా నిర్ధారిత పరీక్షలు నిర్వహించటంతో పాటు సుమారు రెండువారాల పాటు వారందరినీ కూడా విడిగా ఉంచాలని నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన చర్యలకు ఉపక్రమించింది.
కొవిడ్ లక్షణాలు :
ముక్కు కారటం, తుమ్ములు, జ్వరం, ఒళ్లు, గొంతు నొప్పి, ఛాతిలో నొప్పి, తలనొప్పి, చలి, గుండె వేగంగా కొట్టుకోవడం, రెండు మూడు రోజుల తర్వాత పొడి దగ్గు, స్వల్పంగా ఆయాసం, జీర్ణకోశ సమస్యలు, విరేచనాలు ఉంటే కొవిడ్ లక్షణాలుగా అనుమానించాలని వైద్యులు తెలిపారు.
హాంకాంగ్ సహచరుల ద్వారా..
- బెంగళూరులో సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న యువకుడు కంపెనీ పని మీద ఫిబ్రవరి 15న దుబాయికి వెళ్లాడు.
- అక్కడ ఐదు రోజుల పాటు ఇతర దేశాల నుంచి వచ్చిన సహచరులతో కలిసి పనిచేశాడు. ఇందులో హాంకాంగ్ వ్యక్తులున్నారు.
- గత నెల 20న ఆయన బెంగళూరుకు వచ్చాడు. 22న బస్సులో హైదరాబాద్ వచ్చాడు.
- కొద్దిరోజుల తర్వాత జలుబు, జ్వరం రావటంతో సికింద్రాబాద్‌లోని అపోలో ఆసుపత్రి ఓపీలో చూపించుకున్నాడు.
- తగ్గకపోవటంతో స్వైన్‌ఫ్లూ అనుమానంతో వైద్యులు 27న ఆసుపత్రిలో చేర్చుకొని, ప్రత్యేక గదిలో 4రోజులు చికిత్స అందించారు.
- స్వైన్‌ఫ్లూ లేదని నిర్ధారణ అయినప్పటికీ వైరస్ లక్షణాలు తగ్గకపోవటంతో అపోలో వైద్యులు గాంధీ ఆసుపత్రికి వెళ్లాలన్నారు.
- ఈనెల 1న గాంధీలో చేరగా, కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు.
- ఈ పరీక్షల్లో వైరస్ నిర్ధారణ కావటంతో వెంటనే పుణెలోని వైరాలజీ ప్రయోగశాలకు నమూనాలను పంపించారు.
- అక్కడ కూడా నిర్ధారించడంతో సోమవారం (2న) కేంద్ర ప్రభుత్వం కరోనా బాధితుడి సమాచారాన్ని అధికారికంగా ప్రకటించింది.
ఇదీ చదవండి
హైదరాబాద్‌కు 'కరోనా' రాకతో ఏపీ అప్రమత్తం