ఎండిన పైరు.. బకెట్లతో పంటకు నీరు..రైతు దుస్థితి - water
వరుణుడు కరుణిస్తాడన్న ఆశతో వరిపంట వేశాడు. పంట వస్తుందని భారీగానే ఖర్చు చేశాడు. కానీ చినుకు రాలకపోగా..వేసిన పైరు మొత్తాన్ని కరవు కాటేసింది. అయినా ఆ రైతు తన ప్రయత్నాన్ని ఆపలేదు. బకెట్లతో నీటిని తీసుకొస్తూ ఎకరా పైరును తడిపే ప్రయత్నం చేస్తున్నాడు.
కృష్ణాజిల్లా నూజివీడులో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. నారు పోసినా వరి పంట నీరు లేక ఎండిపోతుంటే చూడలేని రైతు భగీరథ యత్నాన్ని మొదలుపెట్టాడు. పొలం పక్కనే ఉన్న చిన్న కుంటలోని నీటిని బకెట్లతో తోడి ఎకరాల పంటను తడిపేందుకు ప్రయత్నిస్తున్నాడు. నూజివీడు పట్టణానికి చెందిన ఎరికయ్య అనే చిన్నకారు రైతు మూడు ఎకరాల్లో వరి సాగు చేశాడు. ఇందులో రెండు ఎకరాలు సరిపడా నీళ్లు లేక ఎండిపోయాయి.. మిగిలిన పంటనైనా రక్షించే ప్రయత్నం చేశాడు ఆ రైతు. ఇంజిన్తో తోడేందుకు సరిపడా నీరు లేనప్పటికీ బకెట్లతో చిన్న కుంటలోని నీటిని తోడి పంటపై చల్లాడు. దీనికి కొడుకు, కోడలు సాయం తీసుకున్నాడు. ఎన్నో గంటలు కష్టపడి పంటను కరవు నుంచి కాపాడుకునేందుకు యత్నించాడు.